ఇమ్రాన్.. భారత్‌ను రెచ్చగొట్టొద్దు.. పాక్ ప్రధానికి ట్రంప్ సూచన..

Kashmir | Donald Trump | Pak PM Imran Khan | భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరంపై భారత్‌తో చర్చలు జరపాలని, దూకుడు తగ్గించుకోవాలని ఇమ్రాన్‌కు ట్రంప్‌ సూచించినట్టు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 10:46 AM IST
ఇమ్రాన్.. భారత్‌ను రెచ్చగొట్టొద్దు.. పాక్ ప్రధానికి ట్రంప్ సూచన..
ఇమ్రాన్‌ఖాన్, ట్రంప్ ( ఫైల్)
  • Share this:
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండిస్తూ, భారత్‌ను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని గ్రహించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడారు. తొలుత ప్రధాని మోదీతో ట్రంప్ మాట్లాడగా.. ఇమ్రాన్ వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్‌తో మాట్లాడుతూ.. భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరంపై భారత్‌తో చర్చలు జరపాలని, దూకుడు తగ్గించుకోవాలని ట్రంప్‌ సూచించినట్టు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని ట్రంప్‌ నొక్కిచెప్పారని.. సంయమనం పాటించాల్సిందిగా ఇరువర్గాలకూ సూచించారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, మోదీ, ట్రంప్‌ త్వరలోనే భేటీ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. ఇదిలా ఉండగా, మోదీ, ఇమ్రాన్‌తో మాట్లాడిన విషయాన్ని ట్రంప్‌ కూడా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇమ్రాన్‌తో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడటం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

మరోవైపు, కశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం నెరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ మరోసారి ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆ అంశం క్లిష్టమైనదని, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాను మధ్యవర్తిత్వం వహించి ఆశాజనక తీర్పు వచ్చేలా చేస్తానని వెల్లడించారు. కాగా, అంతకుముందు కూడా ట్రంప్ ఇలాగే మాట్లాడటంతో.. భారత్ స్పందించి ఆయన ఆఫర్‌ను తిరస్కరించింది. ఈ సమస్య తమకు సంబంధించిన విషయమని, ఇందులో వేరొకరి జోక్యం అవసరం లేదంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Published by: Shravan Kumar Bommakanti
First published: August 21, 2019, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading