news18-telugu
Updated: November 20, 2020, 6:28 PM IST
మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభిృద్ధిపై ప్రగతి నివేదికను తెలంగాణ భవన్లో రిలీజ్ చేశారు. గత ఎన్నికల్లో సెంచరీ మిస్ అయిందని, ఒక్కబాల్ కొడితే సెంచరీ కొట్టేవారిమన్నారు. జాంబాగ్‌లో 5 ఓట్లతో ఓడిపోయామన్నారు. ఈసారి సెంచరీ కొట్టాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ తెలంగాణ కు ఆర్థిక ఇంజిన్ లాంటిదని, హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందన్నారు. హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
‘ఆరేళ్లలో ఏం చేశామో వివరించి చెప్పాలి. కేంద్రం హైదరాబాద్ కు చేసిన ఒక్క పనైనా ఉందా అని ప్రజలను ప్రశ్నించాలి. అభివృద్ధి కావాలా ? అశాంతి కావాలా? అని ప్రజలను అడగాలి. రాష్ట్రానికి సంబంధించి ఇది కీలకమైన ఎన్నిక . ఎలాంటి హైదరాబాద్ కావాలో అంతటా చర్చ పెట్టాలి. రొటీన్ ఎన్నికలా దీన్ని కొట్లాడొద్దు. ఇంటింటికి వెళ్ళాలి. కరోనా సమయం లో భరోసా ఇచ్చింది మనం. ప్రతిపక్షాలు ఎక్కడున్నాయి? వలస కార్మికులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. వలస కార్మికుల నుంచి చార్జీల రూపం లో కేంద్రం డబ్బులు వసూలు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా సేవలు అందించింది. వరదలు వచ్చినపుడు ప్రజల్లో ఉన్నాం. వరద సాయం చేశాం. కేంద్రం మాత్రం పైసా ఇవ్వలేదు. GHMC ఎన్నికల్లో ఓటేస్తే 25 వేలు ఇస్తామంటున్నారు.’ అని కేటీఆర్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ట్రాఫిక్ చలాన్ల పై బీజేపీ అధ్యక్షుడు చెబుతున్న మాటలు చూసి నవ్వుకుంటున్నారన్నారు. ‘గుజరాత్ లో చలాన్లు మీరే కడుతున్నారా? ధర్నా చేయడానికి భాగ్యలక్ష్మి గుడే దొరికిందా? బీజేపీ కి హిందూ ముస్లిం గొడవలు కావాలి. ఇండియా, పాకిస్థాన్ చిచ్చు కావాలి. హైదరాబాద్ కు దమ్ముంటే లక్ష కోట్ల ప్యాకేజ్ బీజేపీ తేగలదా?’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
అన్ని రాజకీయ పార్టీలు సామాజికన్యాయం పేరు చెబుతారని, కానీ, టీఆర్ఎస్ పార్టీ చేతల్లో చూపించిందన్నారు. GHMC ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు అందుకు నిదర్శనమన్నారు. మహిళలకు 75 సీట్లు ఇవ్వాల్సివుండగా 85 సీట్లు ఇచ్చామన్నారు. 17 సీట్లు మైనారిటీలకు, ఎస్టీలకు 3, ఎస్సీ లకు 13 సీట్లు కేటాయించామన్నారు. అగ్రవర్ణాల్లో అందరికీ న్యాయం చేశామన్నారు.
హైదరాబాద్ లో తెలంగాణేతరులకు ఏమవుతుందో అనే తెలంగాణ వచ్చిన కొత్తలో భయాలు ఉండేవని, సీఎం కేసీఆర్ వాటినన్నిటిని పటాపంచలు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో 8 మందికి వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిరపడ్డవారికి టిక్కెట్లు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ఎవరైనా హైదరాబాద్ లో సురక్షితంగా ఉండవచ్చని భరోసా ఇచ్చారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 20, 2020, 6:28 PM IST