మంత్రి కేటీఆర్‌కు కొత్త టెన్షన్.. అసలు కారణం ఇదీ..

టీఆర్‌ఎస్ పార్టీలోనే పలువురు నేతలు పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వెళ్లగక్కడం తలనొప్పిగా మారింది. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని, వారిని పదవులు ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్న సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్లు సమాచారం.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 13, 2019, 11:23 AM IST
మంత్రి కేటీఆర్‌కు కొత్త టెన్షన్.. అసలు కారణం ఇదీ..
మంత్రి కేటీఆర్(File)
  • Share this:
తెలంగాణలో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యం.. ఇదీ బీజేపీ మాట. అందుకు తగ్గట్లే ఆ పార్టీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పలు పార్టీల సీనియర్ నేతలను ఆకర్షిస్తూ బలాన్ని పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఇది కాస్త ఇబ్బందిగా మారింది. తెలంగాణలో బీజేపీకి బలమే లేదనుకుంటున్న తరుణంలో ఆ పార్టీ నాలుగు లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం.. వీలైనంత మందిని పార్టీలో చేర్చుకోవడం లాంటి పరిణామాలు గులాబీ పార్టీకి మింగుడు పడటం లేదు. మరోవైపు, టీఆర్‌ఎస్ పార్టీలోనే పలువురు నేతలు పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వెళ్లగక్కడం తలనొప్పిగా మారింది. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని, వారిని పదవులు ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్న సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ తమకు కాకుండా వేరే వాళ్లకు పదవులు ఇవ్వడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయని రాజకీయవర్గాల్లో టాక్.

ఇక, ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ను కలవడం కొత్త ఊహాగానాలకు తెరతీసింది. పార్టీ తనను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేసిన షకీల్.. కాషాయ కండువా కప్పుకోనున్నట్లు చెప్పడం గమనార్హం. షకీల్ ఒక్కరే కాకుండా పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు పదవులు దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత మాజీ మంత్రి జోగు రామన్న, అరికెపూడి గాంధీ.. మీడియా ముందు వాపోయారు. పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి కూడా మీడియాతో చిట్‌చాట్‌లో కేసీఆర్‌ నిజ స్వరూపం బయటపడిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారికి వెంటనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేయడం, వాళ్లు మీడియా ముందుకు వచ్చి తమ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే.. కేటీఆర్ వారిని బుజ్జగించడంతోనే వాళ్లు సైలెంట్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసి, సీనియర్ నేతలను సంతృప్తి పరిస్తేనే పార్టీలో అసంతృప్తి జ్వాలలు తగ్గే అవకాశం ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇస్తేనే పార్టీకి సమస్య ఉండదని, అదీ.. మునిసిపల్ ఎన్నికల లోపు జరిగితేనే మంచిదని.. లేకపోతే సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుందని, కేటీఆర్ నాయకత్వంపైనా కాస్త నమ్మకం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఉత్తర తెలంగాణ బీజేపీ బలం పుంజుకుంటోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ సీట్లను గెలుచుకున్న ఆ పార్టీ ఈ మధ్యే సీనియర్ నేత వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికింది. ఇదీ కాకుండా మరికొంత మంది సీనియర్ నేతలను పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీలు కూడా దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ అసంతృప్తులకు కూడా గాలం వేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం కూడా కేటీఆర్‌కు టెన్షన్‌గా మారింది. మునిసిపల్ ఎన్నికలకు ముందు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కడంతో పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందేమోనని ఆయన గుబులు చెందుతున్నట్లు తెలుస్తోంది.కరీంనగర్ మినహా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్నది ఆయన్ను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ గులాబీ సేనకు మాజీ ఎంపీ కవిత సారథ్యం వహిస్తారని అంటున్నా, ఇంకా ఆమె బరిలోకి దిగకపోవడం వెనుక.. ఆ పార్టీ వ్యూహం ఏంటన్నది ఇంకా తెలియరావడం లేదు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆదిలాబాద్‌లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. మాజీ మంత్రి జోగు రామన్న మీడియా ముందే తనకు అన్యాయం జరిగిందంటూ చెప్పడం ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ సందర్భంలో పార్టీలో ఉన్న అసమ్మతిని, అసంతృప్తిని చల్లార్చి, మునిసిపల్ ఎన్నికలకు వెళ్తేనే కేటీఆర్‌కు గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని, లేకపోతే కాచుకొని కూర్చున్న బీజేపీకి, మిగతా ప్రతిప్రక్షాల ముందు లొంగిపోవాల్సి వస్తుందని విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి.. కేటీఆర్ ఏం చేస్తారో?
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు