news18-telugu
Updated: November 30, 2020, 10:49 PM IST
బండి సంజయ్ కారుపై దాడి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై దాడి జరిగింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో బండి సంజయ్ కారుపై కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డుకు వచ్చిన బండి సంజయ్ అక్కడ సరదాగా గడిపారు. కొందరు పిల్లలతో కలసి బండి సంజయ్ కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. అనంతరం అక్కడి నుంచి ఆయన సమీపంలోని హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి అక్కడికి బండి సంజయ్‌ను ప్రశ్నించారు. తన డివిజన్లోని ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ వాహనాలను తనిఖీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ స్వల్ప ఉద్రిక్త చోటుచేసుకుంది. దీంతో పోలీసులు సంజయ్‌ను కారులో అక్కడి నుంచి పంపించారు.
అయితే అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ వాహనాన్ని వెంబడించారు. కొద్ది దూరం వెళ్లిన ఆయన వాహనాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. చేతులతో కారుపై దాడికి దిగారు. ఈ క్రమంలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. మరోవైపు ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Bandi Sanjay: నెక్లెస్ రోడ్డులో ఎంజాయ్ చేస్తున్న బండి సంజయ్.. ఫొటోలు
మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ బండి సంజయ్ కారుపై దాడి జరగడం సంచలనంగా మారింది.
Published by:
Sumanth Kanukula
First published:
November 30, 2020, 10:47 PM IST