• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TRS TARGETING YS RAJASHEKAR REDDY IN A STRATEGY TO TARGET YS SHARMILA IN TELANGANA AK

Telangana: టీఆర్ఎస్ వర్సెస్ వైఎస్ఆర్.. మధ్యలో షర్మిల.. అసలేం జరుగుతోంది ?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)

Telangana Politics: షర్మిల పార్టీ తమకు ఇబ్బంది ఉండదని టీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ.. ఆమెను సాధ్యమైనంత తొందరగానే రాజకీయంగా దెబ్బకొట్టాలని గులాబీ పార్టీ ప్లాన్ చేసిందనే ప్రచారం సాగుతోంది.

  • Share this:
    తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ఆ ప్రాజెక్ట్ ఆక్రమం అంటూ విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై కూడా మండిపడుతోంది. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోతోందని తెలంగాణలోని మంత్రులు, ఇతర టీఆర్ఎస్ నేతలు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జలాల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తెలంగాణ మంత్రులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీరును కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు.

    వైఎస్ఆర్‌పై మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అయితే ఉన్నట్టుండి టీఆర్ఎస్ నేతలు వైఎస్ఆర్‌ను టార్గెట్ చేయడం వెనుక అసలు వ్యూహం వేరే ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న వైఎస్ షర్మిల.. పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే జిల్లాలను చుట్టేస్తున్నారు. వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.

    షర్మిల పార్టీ తమకు ఇబ్బంది ఉండదని టీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ.. ఆమెను సాధ్యమైనంత తొందరగానే రాజకీయంగా దెబ్బకొట్టాలని గులాబీ పార్టీ ప్లాన్ చేసిందనే ప్రచారం సాగుతోంది. షర్మిల బలమైన వైఎస్‌ఆర్‌ను టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా ఆమె బలహీనమవుతారని టీఆర్ఎస్ యోచిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జల వివాదాలపై షర్మిల అంత గట్టిగా తమ వాదనలు వినిపించలేరని.. అదే సమయంలో వైఎస్‌ఆర్‌పై విమర్శలు చేయడం ద్వారా ఆమెను ఆదిలోనే కట్టడి చేయొచ్చనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: