మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం ముదిరి పాకానపడుతోంది. మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్కు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఈటల రాజేందర్ యోచిస్తుంటే.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ విషయంలో పొలిటికల్ అప్డేట్ ఇదే అయినా... ఈటల రాజేందర్‌కు పొలిటికల్‌గా చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్న ఈటల రాజేందర్.. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చూపించాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై అక్కడి అనుచరులతో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు ఇదే అంశంపై టీఆర్ఎస్ కూడా గట్టిగానే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌లోనే అడ్డుకుంటే.. ఆయన దూకుడుకు కళ్లెం వేయొచ్చనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఈ కారణంగానే అప్పుడే ఆపరేషన్ హుజూరాబాద్‌ను టీఆర్ఎస్ మొదలుపెట్టిందని సమాచారం. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలకు టచ్‌లోకి వెళ్లే పనిని ఆ పార్టీ నేతలు అప్పుడే మొదలుపెట్టారని సమాచారం.
పార్టీ నాయకత్వంతో ఉంటేనే మేలు అని.. ఈటల రాజేందర్‌తో కలిసి నడిస్తే రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని అక్కడి నేతలకు టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటి నుంచే చెబుతున్నట్టు సమాచారం. ఇక ఆపరేషన్ హుజూరాబాద్ ద్వారా ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టే పనిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌కు టీఆర్ఎస్ నాయకత్వం అప్పగించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
గంగుల కమలాకర్ (File)
టీఆర్ఎస్లో కొంతకాలంగా ఈటల రాజేందర్ వర్సెస్ గంగుల కమలాకర్ అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీకి దూరం కావడంతో... ఆయనకు పొలిటికల్‌గా చెక్ చెప్పే పనిని కూడా గంగుల కమలాకర్కే గులాబీ బాస్ అప్పగించారని తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్‌లో సత్తా చాటాలని ఈటల రాజేందర్ భావిస్తుంటే.. ఆయన కంటే ముందే ఆపరేషన్ హుజూరాబాద్‌ను టీఆర్ఎస్ మొదలుపెట్టినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.