టీఆర్ఎస్లో రాజ్యసభ రేసు జోరందుకుంది. తెలంగాణకు దక్కబోయే రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడనుండటంతో... ఈ రెండు సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. కేసీఆర్ ఈ రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై టీఆర్ఎస్ నేతలకు అంతుచిక్కడం లేదు. అయితే చాలామంది నేతలు రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సీఎం కేసీఆర్ను కలిసిన నాయిని... దీనిపై కేసీఆర్కు తన మనసులోని మాటను చెప్పారు.
కేసీఆర్తో నాయిని(ఫైల్ ఫోటో)
అనంతరం మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన నాయిని... తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను వెళితే ఢిల్లీకే వెళతానని స్పష్టం చేశారు. త్వరలోనే ఎమ్మెల్సీగా నాయిని పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో... ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదా అన్న దానిపై టీఆర్ఎస్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు కొంతకాలంగా టీఆర్ఎస్ నాయకత్వం తీరుపై నాయిని అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం... తన అల్లుడు శ్రీనివాసరెడ్డి విషయంలో పార్టీ వివక్ష చూపుతోందనే భావనలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో నాయిని సీఎం కేసీఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కేసీఆర్ను కలిసి నాయినికి ఆయన నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని తెలుస్తోంది.