కేంద్రంపై యుద్ధమే, పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ భారీ ప్లాన్

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్, ఎంపీ కేకే

TRS Parliamentary party: ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పెడచెవిన పెట్టిందని కేకే అన్నారు. కేంద్రంతో ఇక పార్లమెంట్‌లో పోరాటమేనని, దాన్ని యుద్ధం అనుకున్నా అభ్యంతరం లేదన్నారు.

  • Share this:
    Parliament Sessions: పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. అనంతరం ఎంపీ కేకే మీడియాతో మాట్లాడారు. ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పెడచెవిన పెట్టిందని, రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదన్నారు. కేంద్రంతో ఇక పార్లమెంట్‌లో పోరాటమేనని, దాన్ని యుద్ధం అనుకున్నా అభ్యంతరం లేదన్నారు. కృష్ణా నదీ జలాల వివాదాన్ని కేంద్రం తేల్చడం లేదన్నారు. అలాగే, తెలంగాణ లో సాగు విస్తీర్ణం 24 శాతానికి పైగా పెరిగినా దానికి తగ్గట్టు కేంద్రం యూరియా ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త విద్యుత్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నామని కేకే స్పష్టం చేశారు. ఆ చట్టం తో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోందన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఆ చట్టాన్ని సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ‘జాతీయ రహదారుల విస్తరణ పై కేంద్రం మాట తప్పింది. కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి. ఇంత మోసపూరిత సర్కార్ ను చూడలేదు. నవోదయ స్కూళ్ళు తెలంగాణకు 22 రావాలి. అయినా కేంద్రం స్పందించడం లేదు. జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోంది. రావాల్సిన పది వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఇంకా ఇవ్వట్లేదు. వరంగల్ లో టెక్సటైల్ పార్కు కు నయాపైసా ఇవ్వడం లేదు. ఎయిర్ స్ట్రిప్ లను కూడా కేంద్రం ప్రకటించడం లేదు. పార్లమెంటు లో ఇక కేంద్రం తో బిగ్ ఫైట్స్ ఉంటాయి. సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తాం. రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ పోస్టును రాజకీయాలకు లాగడం సరికాదు.’ అని కేకే అన్నారు.

    మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంటులో తాము జరిపే పోరాటానికి ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ ఎంపీ లు కలిసి వస్తారో, రారో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ లో కాదు వారు ఢిల్లీ లో మాట్లాడాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా సమస్యల పై కేంద్రానికి ఉత్తరాలు రాసి అలసిపోయారని, ఇక కేంద్రాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని నామా అన్నారు. విద్యుత్ చట్టం తో రైతుల వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు పెట్టాలని చూస్తూన్నారని, ఈ విధానాన్ని బీజేపీ ఎంపీ లు ఎలా సమర్దిస్తారని ప్రశ్నించారు. కనీసం నవోదయ స్కూళ్ళు సాధించని అసమర్ధులు బీజేపీ ఎంపీలు అంటూ నామా మండిపడ్డారు. ‘జీఎస్టీ చట్టం తో తెలంగాణ వేల కోట్లు నష్టపోయింది. కరోనా పేరుతో జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తోంది. జాతీయ రహదారుల విషయంలో కనీసం గుంత పూడ్చడం లేదు. పార్లమెంట్ లో ప్రశ్నోత్తారాలు తొలగించడాన్ని ఖండిస్తున్నాం. పార్లమెంటు లోపల, బయట కలిసి వచ్చే పార్టీలతో కలిసి ధర్నా చేస్తాం’ అని నామా నాగేశ్వరరావు తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: