Huzurabad By Election: ఈటలపై పోటీ చేయబోయే టీఆర్ఎస్ అభ్యర్థి.. కేసీఆర్ లెక్క ఇదేనా ?

కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Huzurabad By Election: హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు సర్వేలు చేయిస్తున్నారని.. వాటి నివేదికల ఆధారంగానే గులాబీ బాస్ నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుంటున్నాయి.

  • Share this:
    తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంత ఈజీగా ఎవరికీ అర్థంకావు. ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలు రచించి వారిని చిత్తు చేయడంలో కేసీఆర్ దిట్ట అనే చెప్పాలి. అలాంటి కేసీఆర్, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను ఢీకొట్టేందుకు హుజూరాబాద్‌లో ఎవరిని బరిలో నిలుపుతారనే అంశం సస్పెన్స్‌గా మారింది. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ పరిశీలనలో అనేక మంది పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మొదలుకుని ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ టీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ మదిలో ఉన్నదెవరనే విషయాన్ని చెప్పలేకపోతున్నాయి.

    మరోవైపు ఈటలకు పోటీగా హుజూరాబాద్‌లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని బరిలోకి దింపుతారనే టాక్ మొదలైంది. జనరల్ స్థానమైన హుజూరాబాద్ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడిని బరిలోకి దింపడం ద్వారా ఎవరూ ఊహించని విధంగా ప్రత్యర్థులకు చెక్ చెప్పొచ్చనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం వేరే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దుబ్బాకలో రెడ్డి వర్గానికి చెందిన వారికి టీఆర్ఎస్ సీటు కేటాయించిన టీఆర్ఎస్, నాగార్జునసాగర్‌లో బీసీ వర్గానికి చెందిన భగత్‌కు టికెట్ ఇచ్చింది.

    దీంతో ఈసారి ఎస్సీ వర్గానికి టికెట్ ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అభ్యర్థి ఎంపికకు సంబంధించిన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు సర్వేలు చేయిస్తున్నారని.. వాటి నివేదికల ఆధారంగానే గులాబీ బాస్ నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుంటున్నాయి. మొత్తానికి ఈటలపై పోటీ చేయబోయే అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం ఏ రకంగా ఉంటుందనే విషయం తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
    Published by:Kishore Akkaladevi
    First published: