హరీష్, కేటీఆర్‌ను కాదని.. వినోద్ తెరపైకి వస్తారా?

Telangana Political News: వెలమ సామాజిక వర్గానికి చెంది, పార్టీ సీనియర్ నేత అయిన వినోద్‌ను తెరపైకి తీసుకు రావాలని కేసీఆర్ యోచిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే జవాబిస్తున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 1, 2019, 6:00 PM IST
హరీష్, కేటీఆర్‌ను కాదని.. వినోద్ తెరపైకి వస్తారా?
కేటీఆర్, హరీష్ రావు (ఫైల్)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 1, 2019, 6:00 PM IST
‘మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్‌కు మంత్రి మండలిలో చోటు లభిస్తుందా?’ ఇప్పుడు ఏ నోటా విన్నా ఇదే ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారం చేపట్టాక సీఎం కేసీఆర్ వీరిద్దరికి మంత్రి పదవి ఇవ్వలేదు. కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పజెప్పినా.. హరీష్‌కు మాత్రం ఏ పదవీ దక్కలేదు. దీంతో మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వీరికి అవకాశం దక్కే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు సీఎం కేసీఆర్ మరో విధంగా ఆలోచిస్తున్నారా? హరీష్‌, కేటీఆర్‌లను ఇద్దరినీ కాదని మరో నేతకు అవకాశం ఇస్తారా? వెలమ సామాజిక వర్గానికి చెంది, పార్టీ సీనియర్ నేత అయిన వినోద్‌ను తెరపైకి తీసుకు రావాలని కేసీఆర్ యోచిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే జవాబిస్తున్నాయి. ఈ చర్య వల్ల సీనియర్ నేతకు అవకాశం కల్పించినట్లు అవడంతో పాటు, హరీష్‌, కేటీఆర్‌ల గురించి పెద్దగా చర్చ ఉండదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వినోద్‌కు అవకాశం కల్పించి, బావ, బావమరిదిని పక్కనపెడితే.. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే తన పనులను కొనసాగిస్తారు. హరీష్ మాత్రం సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటారు.

నిజానికి, లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీ పలు స్థానాలను కోల్పోవడంతో.. మళ్లీ హరీష్‌ను తెర పైకి తీసుకు వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ దిశగా గులాబీ పార్టీ నుంచి ఎలాంటి చర్యలు కనిపించలేదు. పైగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా హరీష్‌కు ఆహ్వానం అందలేదు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా హరీష్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వినోద్‌కు అవకాశం కల్పించి హరీష్‌ను పక్కనబెడితే.. పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

వినోద్ కుమార్ (ఫైల్)


ఇక, వినోద్ విషయానికి వస్తే.. ఆయన పార్టీలో సీనియర్ నేత. వెలమ సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడు. మాజీ ఎంపీ. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలైన వినోద్.. కేసీఆర్‌కు దగ్గరి మనిషి. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న నేత. ఈయన్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటే పలు అంశాల్లో కలిసి వస్తుందన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు అయినందున పాలనలో కలిసి వస్తుందని, బలమైన నాయకుడి మాటకు విలువ ఉంటుందన్న ఉద్దేశంతో వినోద్‌ను తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...