TRS MLC PALLA RAJESHWAR REDDY INTERESTING COMMENTS REGARDING ACTION ON ETELA RAJENDAR AK
Etela Rajendar: ఈటల రాజేందర్‌పై చర్యలు.. టీఆర్ఎస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు
ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Etela Rajendar: బీజేపీలో చేరడానికి ముందే లేదా చేరిన తరువాత టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ మంత్రివర్గం నుంచి బహిష్కరణకు గురైన మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై పార్టీ పరంగా టీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన ఈటల రాజేందర్.. త్వరలోనే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం కావడంపై టీఆర్ఎస్ స్పందించింది. టీఆర్ఎస్ ముఖ్యనేత, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుల్లో ఒకరైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్‌పై పార్టీ అధ్యక్షుడు ఏ చర్య అవసరమనుకుంటే ఆ చర్య తీసుకుంటారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
40 ఎకరాల అసైన్డ్ భూమి తీసుకున్నానని ఈటల స్వయంగా ఒప్పుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌లను కలిశానని చెబుతున్న ఈటల.. వారికి ఎవరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఈటల రాజేందర్ బహుజనవాదం, వామపక్షవాదం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ మాట్లాడేది ఒకటి.. చేసేది మరొకటని ఆయన విమర్శించారు. ఈటల తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారని మండిపడ్డారు. మరోవైపు ఈటల రాజేందర్‌పై పార్టీ పరమైన చర్యలు తీసుకునే విషయంలో టీఆర్ఎస్ సుముఖంగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్‌పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే.. ఆయనకు రాజకీయంగా స్వేచ్ఛ లభిస్తుందనే భావనలో టీఆర్ఎస్ ఉంది. అదే జరిగితే.. ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇతర పార్టీలో చేరిపోయే అవకాశం ఉంటుందని యోచిస్తోంది. అయితే పార్టీపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండానే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా ఆయనపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్ సైతం బీజేపీలో చేరడానికి ముందే లేదా చేరిన తరువాత టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.