తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరవాత కాంగ్రెస్‌లో కూడా దూకుడు పెరిగింది. పార్టీని వీడిన నేతలు, ఇతర పార్టీల్లోని నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే అధికార టీఆర్ఎస్ను కాదని.. కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలెవరూ ముందుకు రాకపోవచ్చని చాలామంది భావించారు. ఇలాంటి సమయంలోనే టీఆర్ఎస్లో చేరిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పొగడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. తెలంగాణ ప్రజల బాధలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ రాములు నాయక్ సోనియాగాంధీని పొగడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ పార్టీ చతికలపడింది. అక్కడ టీఆర్ఎస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. తెలంగాణలో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఒకరు కాగా, వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ మరొకరు. వీరిద్దరూ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల వ్యవధిలోనే టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్‌లోని కొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు.
టీఆర్ఎస్లో చేరిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వారిలో ఎక్కువమంది ఖమ్మం జిల్లాకు చెందినవారే అని ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇండిపెండెంట్‌గా గెలిచి టీఆర్ఎస్లో చేరిన రాములు నాయక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని పొగడటం వెనుక అసలు కారణం ఏమిటనే చర్చ మొదలైంది. ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టే ఈ వ్యాఖ్యలు చేశారా ? అనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యేలు ఆ తరువాత యూటర్న్ తీసుకోవడం చాలా సహజం. కాబట్టి రాములు నాయక్ కూడా అదే రకంగా వెనక్కి తగ్గుతారా ? లేక తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా ? అన్నది తెలియాల్సి ఉంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.