TRS MLA MYNAMPALLY HANUMANTHA RAO VERBAL FIGHT WITH TRAFFIC SI IN HYDERABAD SK
Telangana: నడిరోడ్డుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం.. ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్ విసిరికొట్టి..
మైనంపల్లి హనుమంతరావు ఫైల్ ఫోటో(Image:Facebook)
కొన్ని నిమిషాల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘటనా స్థలానికి వెళ్లారు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ దగ్గరకు వెళ్లి గొడవపడ్డారు ఎమ్మెల్యే. అతడు నా అనుచరుడు అని చెప్పినా.. వినవా..? అంటూ మండిపడ్డారు.
నడిరోడ్డుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐతో గొడవపెట్టుకున్నారు. అంతేకాదు ఆయన మొబైల్ ఫోన్ లాక్కొని విసిరికొట్టారు. హైదరాబాద్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లి నుంచి కొంపల్లి వైపు ఓ వాహనం రాంగ్ రూట్లో వచ్చింది. అక్కడే ఉన్న ఎస్ఐ అడ్డుకున్నాడు. డ్రైవర్‌ను కిందకు దింపి అడిగితే.. తాను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మనిషినని, నన్నే అడ్డుకుంటావా? అని మండిపడ్డారు. నువ్వు ఎవరైతే నాకేంటి.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా.? అని ఎస్ఐ స్పష్టం చేశాడు. ఐతే ఆ వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు.
అనంతరం కొన్ని నిమిషాల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘటనా స్థలానికి వెళ్లారు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ దగ్గరకు వెళ్లి గొడవపడ్డారు ఎమ్మెల్యే. అతడు నా అనుచరుడు అని చెప్పినా.. వినవా..? అంటూ మండిపడ్డారు. ఎస్ఐ పట్ల దుర్భాషలాడారు. నోటికి వచ్చినట్లు తిట్టారు. అందుకాదు ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ ఎస్ఐ ఫోన లాక్కొన్ని..విసిరికొట్టారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ఇలా ప్రవర్తిస్తారా? అని ట్రాఫిక్ ఎస్ఐ తీరుపై మైనంపల్లి మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురికీ సర్దిచెప్పారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై ట్రాఫిక్ ఎస్ఐ.. పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించడమే గాకుండా.. నోటికొచ్చినట్లు తిట్టారని, ఫోన్ పగులకొట్టారని పేర్కొన్నారు. తన డ్యూటీ తాను చేయడం కూడా తప్పా..? అని ఆయన వాపోయారు. ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ట్రాఫిక్ ఎస్ఐపై ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.