హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ తన మీద తానే దాడి చేయించుకుని సానుభూతితో ఓట్లు పొందే కుట్ర చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యే అవకాశం ఉందని బాల్క సుమన్ జోస్యం చెప్పారు. నామినేషన్ వేసిన తరవాత ఈటల రాజేందర్ ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఏదో ఒక గ్రామంలో తన మనుషులతో తానే దాడి చేయించుకునే అవకాశం ఉందని ఆరోపించారు. ఆ తరువాత ఆయనకు దెబ్బలు తగిలినట్టు డ్రామా చేస్తారని విమర్శించారు. అనంతరం వీల్ ఛైర్లో ఈటల రాజేందర్ కూర్చుని.. ఆయన భార్య జమున ఓట్లు అడుగుతారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు.
సానుభూతి ద్వారా ఓట్లు సాధించేందుకు ఈటల రాజేందర్ ఈ రకమైన ప్లాన్ చేశారని అన్నారు. ఈ రకమైన డ్రామాలు చేయడం బీజేపీ నేతలకు కొత్తేమీ కాదని ఆయన అన్నారు. గతంలో బండి సంజయ్, రఘునందన్ రావు, రాజాసింగ్ ఇలాంటి డ్రామాలు చేశారని బాల్క సుమన్ ఆరోపించారు. అసలు తన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారనే విషయాన్ని ఈటల రాజేందర్ ఇప్పటివరకు చెప్పలేదని అన్నారు.
ఎంతసేపు తమను తిట్టడం తప్పితే.. తాను గెలిస్తే ఏం చేస్తాననే విషయాన్ని ఈటల రాజేందర్ చెప్పడం లేదని బాల్క సుమన్ అన్నారు. ఎన్నికలు జరిగే చోట నాయకులంతా ప్రచారానికి వస్తారని.. గెలుపు కోసం పని చేస్తారని తెలిపారు. గతంలో ఇదే ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ గెలుపు కోసం అనేక నియోజకవర్గాల్లో నెలల పాటు ఉండి పని చేసిన విషయాన్ని మర్చిపోయారా ? అని ప్రశ్నించారు.
ఈటల రాజేందర్ తరపున ప్రచారం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఎందుకు వస్తున్నారని బాల్క సుమన్ అన్నారు. నియోజకవర్గంలో తన అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్.. తామే డబ్బు ఖర్చు చేస్తున్నట్టు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా తెలంగాణ ఉద్యమకారుడే అని అన్నారు. ఆయనను గెలిపించి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.