కారును తొక్కేసిన రోడ్డు రోలర్..భువనగిరిలో టీఆర్ఎస్‌కు షాక్..

ప్రతీకాత్మక చిత్రం

TRS lost bhongir lok sabha: అది ఇంచుమించు కారు గుర్తును పోలి ఉంటుంది. ఈవీఎంలోని బ్యాలెట్ యూనిట్‌పై కారు గుర్తు పైనుంచి మూడోది కాగా.. రోడ్డురోలర్ కింద నుంచి మూడోదిగా ఉంది. ఈ క్రమంలో చాలా మంది వృద్ధులు రోడ్డురోలర్‌ని కారుగా భావించి ఓటువేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

  • Share this:
    'కారు..సారు..పదహారు'..! తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నినాదమిది..! కానీ గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ బొక్కబోర్లాపడింది. 16 సీట్లు ఆశిస్తే 9 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌ 3 స్థానాల్లో గెలుపొందగా.. అనూహ్యంగా బీజేపీ 4 సీట్లు గెలిచింది. ఎప్పటిలాగే హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐఎం గెలిచింది. ఐతే టీఆర్ఎస్ లెక్కలు ఎలా తప్పాయని గులాబీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో భవనగిరి లోక్‌సభ ఫలితం చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి నర్సయ్య గౌడ్ విజయాన్ని కారు గుర్తను పోలిఉండే రోడ్డు రోలర్ గుర్తు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

    భువనగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఐతే 5,219 ఓట్ల స్పల్ప మెజార్టీతోనే ఆయన గెలుపొందారు. భువనగరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐతో పాటు 9 మంది ఇండిపెండెంట్లు పోటీచేశారు. అక్కడ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయన్న లెక్కలు చూస్తే... భువనగరిలో మొత్తం 12,12,631 పోలయ్యాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5,32,795 ఓట్లు పడగా... నర్సయ్యగౌడ్‌కు 5,27,576 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 65,457, సీపీఐ అభ్యర్థికి 28,153 ఓట్లు పడ్డాయి.

    ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో అనూహ్యంగా సింగపాక లింగంకు 27,973 ఓట్లు పోలయ్యాయి. ఆయనకు ఎన్నికల అధికారులు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. అది ఇంచుమించు కారు గుర్తును పోలి ఉంటుంది. ఈవీఎంలోని బ్యాలెట్ యూనిట్‌పై కారు గుర్తు పైనుంచి మూడోది కాగా.. రోడ్డురోలర్ కింద నుంచి మూడోదిగా ఉంది. ఈ క్రమంలో చాలా మంది వృద్ధులు రోడ్డురోలర్‌ని కారుగా భావించి ఓటువేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు దెబ్బతీయగా.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్డురోలర్ టీఆర్ఎస్‌ను ఓడించిందని వాపోతున్నారు.
    First published: