TRS LEADERS ARE HOPING TO CONTEST ON THE TRS TICKET FROM KOTHAGUDEM CONSTITUENCY DUE TO PUBLIC OPPOSITION TO SITTING MLA VANAMA VENKATESWARA RAO KMM PRV
TRS Party: తెరాస నేతలందరి ఆశలు ఆ సీటుపైనే.. ఆశవహులను ఊరిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం
ప్రతీకాత్మక చిత్రం
కుమారుడు రాఘవ ఆకృత్యాలతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వరావు పదవికి ఎసరు వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వనమాకు టీఆర్ఎస్ టికెట్ కష్టమే అంటున్నాయి పార్టీ వర్గాలు.
(జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
అవును. ఇప్పుడు ఆ సీటు అనేకమందిని ఊరిస్తోంది. అసలే ఆదివాసీలు, ఇతర షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లా కావడంతో ఉన్న పది సీట్లలో సగం ఎస్టీలకు, రెండు ఎస్సీలకు రిజర్వేషన్ పోను, మిగిలినవి మూడు. మూడే జనరల్. వీటిలో ఒకటి ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, పాలేరు నుంచి కందాళ ఉపేందర్‌రెడ్డి ఉన్నారు. ఇక తాజా పరిణామాలతో కొత్తగూడెం (Kothagudem) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెరాస అధినేత, సీఎం కేసీఆర్ (KCR) మరోసారి టికెట్ (TRS Ticket) కేటాయించడం దుర్లభం అంటున్నాయి తెరాస శ్రేణులు (TRS party). ఒకవేళ ఏ కోశానో సిట్టింగ్ పేరిట టికెట్ కేటాయించినా గెలవడం అనేది అయ్యే పనికాదన్న విషయంలోనూ తెరాస అధినాయకత్వానికి క్లారిటీ వచ్చేసిందంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయ శక్తులను ప్రోత్సహించే పనిలో భాగంగానే ఈ నియోజకవర్గం విషయంలో లీనియన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
పోటీగా ముగ్గురు సీనియర్లు..
వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయడానికి అనేక మంది తెరాస (TRS party)లోని నేతలు తమ సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాదు. ఇప్పటికే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasareddy) ఈ సీటు పై కన్నేసినట్టు చెబుతున్నారు. ముగ్గురిలో ఎవరిని అధినేత ప్రోత్సహిస్తారు..? ఎవరిని ఆశీర్వదిస్తారన్న దానికి ఇంకా సమయం ఉన్నా.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ (law and Order) సక్రమంగా ఉండాలంటే జలగం రావాల్సిందేనంటూ ఇప్పటికే సోషల్‌మీడియాలో హడావుడి మొదలైంది. ఇక అభివృద్ధి ప్రధాత తుమ్మలతోనే భద్రాద్రి జిల్లా అభివృద్ధి సాధ్యం అంటూ ఆయన అభిమానులు సైతం సందడి చేస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి ఒక అడుగు ముందుకేసి మరీ ఆ ప్రాంతంలోని పాత సంబంధాలను తిరిగి కలుపుతున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఆ జిల్లాకు చెందిన మజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, తుళ్లూరి బ్రహ్మయ్య ఇంకా ఇతర నాయకులతో మంతనాలు జరిపారు. వెరసి ఇన్నాళ్లూ లేని ఈ సందడికి కారణమేంటి..? ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా ఉన్న తెరాస నేతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెరాస అధి నాయకత్వం, అందరినీ సంతృప్తి పర్చలేక ఇబ్బందులు పడుతోంది. ఇక తెరాసలో భవిష్యత్ కష్టమే.. ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూడాల్సిందే అని అభిమానుల నుంచి వత్తిడి వస్తున్న తరుణంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు కొత్తగూడెం పరిణామాలు ఈ ముగ్గురిలో ఆశలు పెంచినట్టయింది. సో ఫైనల్‌గా ఎవరికి బెర్త్ కేటాయిస్తారన్నది అధినేత నిర్ణయం. వీరి అదృష్టం అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం (Kothagudem Assembly constituency). సింగరేణి బొగ్గు గనులకు హెడ్‌క్వార్టర్ లాంటిది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో విలక్షణతకు నిలయం. పారిశ్రామికంగా, వ్యాపారపరంగా, వాణిజ్యపరంగానూ కీలకమైన స్థానం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో ఇక్కడ నుంచి సైతం ఉద్యమం రగిలింది. సింగరేణి, పాల్వంచ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ, ఐటీసీ, నవభారత్ ఫెర్రోఅల్లాయిస్, ఇంకా అనే అనుబంధ రంగాలకు చెందిన పరిశ్రమలకు ఈ ప్రాంతం నిలయం. ఉద్యోగాల కల్పన, వ్యాపారాలు పుంజుకోవడం.. ప్రత్యేక రాష్ట్ర అవతరణ అనంతరం కొత్తగూడెం కేంద్రంగా జిల్లా ఏర్పాటైంది. క్రైం రేటు సైతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే ఈ నియోజకవర్గంలో 2014లో తెరాస తరపున గెలుపొందిన జలగం వెంకటరావు దాదాపు అన్నిటినీ అదుపులో పెట్టారు.
నలభై ఏళ్ల సామ్రాజ్యం..
అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాజా పరిణామాలతో నలభై ఏళ్లుగా తాను నిర్మించుకున్న రాజకీయ సౌధం తన కళ్లముందే కూలిపోతుంటే.. భవిష్యత్ అనేది శూన్యంగా కనిపిస్తుంటే.. కన్న కొడుకు పాల్పడిన అకృత్యాలను ఆపలేక.. అడ్డుకోలేక.. చివరకు ఇక ఇదే ఆఖరు అన్నట్టుగా పరిస్థితి తయారై.. దిగాలుగా మారిన మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదే రాజకీయంగా అవకాశం కోసం చూస్తున్న వారికి పరిస్థితి సానుకూలంగా మారినట్లయింది.
ఎవరి బలం వారిది..
కొత్తగూడెం నియోజకవర్గంపై దృష్టి సారించినట్టు ప్రచారం అవుతున్న ముగ్గురు నేతలు తెరాసలో సీనియర్లు కావడం.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ ప్రాంతం కొట్టిన పిండి కావడం కలిసొచ్చే అవకాశం. ఇక జలగం వెంకటరావు విషయానికొస్తే ఆయన పనితీరుతో గతంలో మెప్పించినా, తన తండ్రి జలగం వెంగళరావు కేంద్ర పరిశ్రమల మంత్రిగా ఉన్నపుడు తీసుకున్న చొరవ మూలంగానే ఆ ప్రాంతం పారిశ్రామికంగా ముందడుగు వేసిందన్నది ప్రజల మది నుంచి చెరగలేదని చెప్పొచ్చు. ఈ సీటుపై ఆశ పడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇక్కడ విస్త్రుతమైన సంబంధాలు ఉండడం కలిసొచ్చే అంశం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో లీడ్ తీసుకోవడం ద్వారా ట్రేడ్ యూనియన్లతోనూ ఉన్న సంబంధాలు పొంగులేటికి కలిసొచ్చే అంశం. ఇలా మరోసారి తెరాసలోనే వెలిగే అవకాశం కోసం కొత్తగూడెం వీరిలో ఒకరికి వేదిక కాబోతుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.