• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TRS LEADER SWAMY GOUD PRAISES CONGRESS MP REVANTH REDDY BA

రేవంత్ రెడ్డికి అండగా ఉండాలి, పొగడ్తల్లో ముంచెత్తిన టీఆర్ఎస్ కీలక నేత

రేవంత్ రెడ్డికి అండగా ఉండాలి, పొగడ్తల్లో ముంచెత్తిన టీఆర్ఎస్ కీలక నేత

రేవంత్ రెడ్డి (File)

Revanth Reddy Latest News | రేవంత్ రెడ్డి అగ్రకులంలో పుట్టినా కూడా వెనుకబడిన కులాల వారికి అండగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ చెప్పారు.

  • Share this:
    Swamy Goud on Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిత్యం విమర్శలు గుప్పించే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి‌నా పొగడ్తల్లో ముంచెత్తారు టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితోపాటు స్వామిగౌడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీద ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి అగ్రకులంలో పుట్టినా కూడా వెనుకబడిన కులాల వారికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉంటున్న రేవంత్ రెడ్డికి మనం కూడా అండగా ఉండాలని బీసీ సామాజికవర్గానికి చెందిన స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. వైట్ డ్రెస్సులు వేసుకునే వారికి అమ్ముడు పోవద్దని సూచించారు. ఎన్నికల్లో డబ్బులున్న వారికే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని స్వామిగౌడ్ అన్నారు. ఒకరు రూ.2500 కోట్లు ఉన్న వారిని బరిలోకి దింపితే, మరొకరు రూ.3500 కోట్లు ఉన్నవారిని పోటీకి నిలుపుతున్నారని అన్నారు. అలాగే, ఒక పార్టీ 10 మందిని చంపిన వారిని పోటీకి దింపితే, మరో పార్టీ 15 మందిని హత్య చేసిన వారిని బరిలోకి దింపుతోందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, కొత్త రాజకీయాలకు రూపుదిద్దాలని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన అన్నారు.

    రేవంత్ రెడ్డి కూడా స్వామి గౌడ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ ల పాత్ర ఎవరు కాదనలేరన్నారు. రాజకీయంగా తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ... తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ నాయకత్వంలో పోరాటం చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సమైక్య పాలనలో స్వామి గౌడ్ మీద దాడి చేసిన అధికారులకే ఈరోజు అందలం ఎక్కించారని, బడుగు బలహీన వర్గాల బిడ్డ స్వామిగౌడ్ కి ఈరోజు గుర్తింపు కరువైందని అన్నారు.

    మూడు రోజుల క్రితం కుల రాజకీయాలపై స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో, రాష్ట్రం లో కొన్ని కొన్ని కులాలకు చెందిన వారే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారు. వందేళ్ల క్రితం ఏర్పడ్డ కుల రక్కసి పునాదులే ఇప్పటికి పరిపాలనను కొనసాగుతున్నాయి. ఇది బలహీన వర్గాలపై జరుగుతున్న దాడి. దేశంలో గుడి, బడి కొంతమందికే పరిమితి కావడం, మళ్ళీ మొదటికి రావడం వల్లే నారాయణ గురును గుర్తు చేసుకుంటున్నాం. ఏకరూప సిద్ధాంతాన్ని దేశంలో విస్తరింపజేయాలని కృషి చేసిన నారాయణ గురు ఆశయాలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలి. అధికారం కొంతమందికే పరిమితం పరిమితమైంది. నారాయణ గురు స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాలి. కులం, మతం పక్కన పెట్టి ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో, ఎవరైతే పరిపాలన సాగించగలరో, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరో, అలాంటి వ్యక్తులు ఏకరూప సిద్ధాంతంపై ఏకమయ్యే రోజు త్వరలోనే రాబోతుంది.'' అని స్వామిగౌడ్ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు