Nagarjuna Sagar Bypoll: బీజేపీ ఎఫెక్ట్.. ‘నాగార్జున్‌సాగర్‌’పై టీఆర్ఎస్ తర్జనభర్జన..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Nagarjuna Sagar Bypoll: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య 208176 ఉండగా.. 2018లో 179955 ఓట్లు పోలయ్యాయి. విజేతగా నిలిచిన నోముల నర్సింహయ్యకు 83655 ఓట్లు రాగా.. రెండు స్థానంలో నిలిచిన జానారెడ్డికి 75884 ఓట్లు వచ్చాయి.

  • Share this:
    దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించడంపై ఫోకస్ పెట్టడంతో టీఆర్ఎస్ కూడా అప్రమత్తమైంది. జానారెడ్డి కుటుంబాన్ని బీజేపీలోకి తీసుకొచ్చి... ఆయన లేదా ఆయన కుమారుడిని పార్టీ తరపున బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలిచిన జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీ తరపున బరిలోకి దిగితే టీఆర్ఎస్‌కు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయమనే భావనలో కమలనాథులు ఉన్నారు.

    ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా ముందుగానే రంగంలోకి దిగాలని నిర్ణయించింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో.. ఈ సారి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులను బరిలోకి దింపడమా ? లేక వేరే వారికి అవకాశం ఇవ్వడమా ? అనే అంశంపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంపై కొంతమేర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సానుభూతి కోణంలో ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.

    అయితే అక్కడ టీఆర్ఎస్ ఆశించినట్టుగా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో ఎలా వ్యవహరించాలనే దానిపై టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ నోముల కుటుంబసభ్యులకు టికెట్ ఇచ్చే విషయంలో సర్వే నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. నిఘా వర్గాలతో పాటు పార్టీ పరంగా సర్వేలు నిర్వహించి.. ఆ తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య 208176 ఉండగా.. 2018లో 179955 ఓట్లు పోలయ్యాయి. విజేతగా నిలిచిన నోముల నర్సింహయ్యకు 83655 ఓట్లు రాగా.. రెండు స్థానంలో నిలిచిన జానారెడ్డికి 75884 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికి 9819 ఓట్లు రాగా.. నాలుగో స్థానంలో నిలిచిన కంకణాల నివేదికకు 2675 ఓట్లు వచ్చాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: