తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత రాజకీయ వ్యూహాలు ఎవరికీ ఓ పట్టాన అర్థంకావు. పదవుల పంపకం విషయంలోనూ ఆయన నిర్ణయాలు ఇదే రకంగా ఉంటాయి. కీలక పదవులను సైతం కేసీఆర్ ఎవరికి ఇస్తారనే విషయం చివరి వరకు సస్పెన్సే. తాజాగా వచ్చే ఏడాది టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్న రెండు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతాయనే అంశం ఆసక్తికరంగా మారింది. కేశవరావు పదవికి రెన్యువల్ ఉంటుందా ? లేదా ? అనే చర్చ అప్పుడే పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. కేకే పదవి రెన్యువల్ సంగతి అలా ఉంచితే... రెండో సీటు కవితకు దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది.
అయితే కవితకు టీఆర్ఎస్ నుంచే గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మాజీ ఎంపీ వినోద్ సైతం రాజ్యసభ రేసులో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీయడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడం వంటివి చేయాలంటే వినోద్ వంటి నేత ఢిల్లీలో ఉండాలని కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం.
వినోద్ కుమార్ (ఫైల్)
ఒకవేళ వినోద్‌కు రాజ్యసభ సభ్యత్వం దక్కితే... అదే సామాజికవర్గానికి చెందిన కవితకు రాజ్యసభ సీటు దక్కడం దాదాపు కష్టమే. దీనికి తోడు ఇప్పటికే కేసీఆర్‌కు సమీప బంధువైన సంతోష్ రాజ్యసభ సభ్యుడిగా ఉండటంతో... కవితను పెద్దల సభకు పంపడం వల్ల విమర్శలు రావొచ్చనే అభిప్రాయం కూడా టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి రాజ్యసభ రేసులో కవితకు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.