గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ మహానగరం అని దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారన్నారు. గుజరాతీ గల్లీ, పార్శిగుట్ట లాంటి భిన్నమైన ప్రాంతాలు కూడా నగరంలో ఉన్నాయన్నారు. తమిళం, బెంగాళీ, మలయాళీ, హిందీ, గుజరాతీ వారు ఇక్కడ స్థిరపడ్డారన్నారు. ఇప్పటికే నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, నగరంలో నీటి కొట్లాటలు లేవన్నారు. హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు.
మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైన అంశాలు1. జీహెచ్ఎంసీ కోసం సమగ్రమైన చట్టం
2. నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా. ఎలాంటి బిల్లు ఉండదు
3. డిసెంబర్ నుంచి సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా
4. లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్
5. కరోనా కాలానికి సంబంధించి (మార్చి నుంచి డిసెంబర్ ) మోటారు వాహన పన్ను సుమారు రూ.267 కోట్లు రద్దు6. పరిశ్రమలకు, వ్యాపారసంస్థలకు హెచ్డీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్ చార్జీలు మినహాయింపు
7. రాష్ట్రంలో రూ.10కోట్ల లోపు బడ్జెట్‌తో తీసే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్
8. రాష్ట్రంలో అన్ని ధియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి
9. హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చేందుకు కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణం త్వరలో నిర్మాణం ప్రారంభం
10. హైదరాబాద్‌లో డ్రైనేజీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం రూ.13,000 కోట్లు
11. వరద నీటి నిర్వహణకు రూ.12,000 కోట్లతో మాస్టర్ ప్లాన్
12. గోదావరితో మూసీ అనుసంధానం. బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీలో బోటింగ్. అందుకోసం రూ.5000 కోట్లు
13. మెట్రో రైలు రెండో దశలో రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు, బీహెచ్ఈఎల్ నుంచి మెహిదీపట్నం వరకు విస్తరణ.
14. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు ప్రాజెక్టు
15. మరో 90 కిలోమీటర్ల వరకు ఎంఎంటీఎస్ రైళ్ల విస్తరణ
16. SRDP రెండు, మూడో దశ పనులు ప్రారంభం. మొదటి దశలో ఈస్ట్, వెస్ట్ జోన్లలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణం.. దీన్ని మిగిలిన ప్రాంతాలకు వర్తింపు
17. మెట్రో రైలు అందుబాటులో లేని ప్రాంతాల్లో బీఆర్టీఎస్ రోడ్లు నిర్మాణం
18. హైదరాబాద్ రింగ్ రోడ్డు అవతల మరో రీజనల్ రింగ్ రోడ్డు
19. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌ల నిర్మాణం
20. కాలుష్యాన్ని తగ్గించేందుకు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంపు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు
21. చెత్తతో విద్యుత్ తయారీ. ప్రస్తుతం 23 మెగావాట్ల నుంచి 43 మెగావాట్లకు పెంపు
22. హైదరాబాద్ నాలుగు వైపులా టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు
23. నగరంలో అభివృద్ధి వికేంద్రీకరణ
24. నగరవాసులకు 24 గంటల విద్యుత్ సరఫరా
25. ఆరేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కలిపి 17 లక్షల 80వేల ఉద్యోగాలు కల్పించాం.
26. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగింపు. వివాదాస్పద స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణ. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణ
27. స్థలాలు ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షల వరకు ఇవ్వాలని ప్రతిపాదన.
28. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్లో లైబ్రరీ, క్లబ్, యోగా, జిమ్ సెంటర్, ఉచితంగా బస్ పాస్‌లు.
29. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఈ - లైబ్రరీలు, ఇంటర్నెట్ సౌకర్యం
శాంతియుత హైదరాబాద్ ఉండాలో, కత్తులతో పొడుచుకునే నగరం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. మతశక్తులు, విచ్ఛిన్నకర శక్తులకు చాన్స్ ఇవ్వొద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశాన్ని పరిపాలించే పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని కేసీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఫ్లాప్ అయిందన్నారు. ఈ దేశానికి మార్గనిర్దేశం కల్పించడంలో ఆ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. ఆ రెండు పార్టీలు కేవలం కథలు చెబుతున్నాయన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారికి ఎన్నికల తర్వాత రూ.10,000 సాయం కచ్చితంగా అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.