news18-telugu
Updated: December 4, 2018, 5:04 PM IST
సీఎం కేసీఆర్
‘ఆఖరు ఓటు తేలే వరకు ఓటమి అంగీకరించను’ అదేదో సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. రియల్ పాలిటిక్స్ విషయానికొస్తే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరిగ్గా సరిపోయే డైలాగ్ ఇది. ఏ పరిస్థితిలోనూ విశ్వాసాన్ని వీడరాయన. తన మానాన తాను ప్రయత్నం చేస్తూ ఫలితం కోసం ఎదురుచూస్తుంటారు. ఆ ప్రయత్నమే ఆయనను 2014లో అధికారంలో కూర్చోబెట్టింది. పాలనలోనూ ప్రజారంజక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మరోసారి అదే విశ్వాసంతో 2018 ముందస్తు ఎన్నికలు వెళ్లారు కేసీఆర్. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై కూటమిగా ఏర్పడినా.. జంకులేకుండా ఒంటరిగా ముందుకెళ్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, ఏ పరిస్థితిలోనూ విజయంపై నమ్మకాన్ని కోల్పోని కేసీఆర్.. అలంపూర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరాకుగా కార్యకర్తలపై కసురుకున్నారు. గోల చేస్తే మీటింగ్ నుంచి వెళ్లిపోతానంటూ బెదిరించారు కూడా.
అయితే వాళ్ళు గోల ఆపకపోవడంతో, సంగతేంటో చూడమంటూ పక్కనున్న ఎంపీ జితేందర్ రెడ్డిని పురమాయించారు. యువకులు ఉత్సాహంగా ఉన్నారంటూ జితేందర్ రెడ్డి బదులిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ ఈ ఉత్సాహమే మన కొంపముంచుతోంది’ అంటూ చిరాకు ప్రదర్శించారు. ఇన్ని ప్రజాఆశీర్వాద సభల్లో మాట్లాడిన కేసీఆర్.. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించారు. కార్యకర్తలు కాస్త ఉత్సాహంతో గోల చేసినా.. చిరాకును ప్రదర్శించలేదు. కానీ, అలంపూర్ సభలో ఆయన కాస్త భిన్నంగా స్పందించడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంప ముంచుతోందంటూ.. అధినేత వ్యాఖ్యానించడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
కేసీఆర్ మాటలో ఆంత్యరాన్ని మరోలా అనుకుంటున్నారు ఇంకొందరు. ఫలితాలేమైనా, పార్టీకి వ్యతిరేకంగా రాబోతున్నాయా? ఆ రిపోర్టు తెలిసే కేసీఆర్ అలా చిరాకుగా, నిరాక్తంగా వ్యవహరించారా? అనే డౌట్లు వస్తున్నాయి. అయితే, కార్యకర్తల అత్యుత్సాహాన్ని నిలువరించేందుకే కేసీఆర్ ఇలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. యాదృశ్చికంగా జరిగిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
Published by:
Santhosh Kumar Pyata
First published:
December 4, 2018, 3:28 PM IST