Andhra Pradesh: పార్కింగ్ కోసం అంత దారుణమా.. మేయర్ తీరుపై సర్వత్రా విమర్శలు

మేయర్ పార్కింగ్ కోసం చెట్లు నరికివేత

మొక్కలు చనిపోతే బాధ్యత గ్రామ సర్పంచులదే అని.. అందుకు వారు తగిన మూల్యం చెల్లించుకోవాలని ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామా చంద్రా రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కానీ అదే పార్టీకి చెందిన మేయర్ మాత్రం.. తన కార్ పార్కింగ్ కోసం గ్రీన్ బెల్ట్ లో ఉన్న చెట్లను నరికివేశారు. దీంతో ఆమె తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

  • Share this:
    రాజు తలచుకుంటే రాళ్ల దెబ్బల కరువా అన్నట్టు ఉంది కొందరు వైసీపీ నేతల తీరు.. అధికారంలో ఉన్నాం.. మాకెంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ చెట్లు నాటండి.. అని చెబుతున్నారు. తాజాగా మంత్రి పెద్ది రెడ్డి సైతం ఒక్క మొక్క బ్రతకకపోయినా సర్చంచులపై వేటు తప్పదని హెచ్చరించారు.. పార్టీ అదిష్టానం మొక్కలను కాపాడాలని పిలుపు ఇస్తుంటే.. అదే పార్టీకి చెందిన ఓ మేయర్ మాత్రం తన కారు పార్కింగ్ కోసం చెట్లపై వేటు వేశారు. అది కూడా ఏకంగా గ్రీన్ బెల్ట్ లోని పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి పెదగరలో నివాసం ఉంటున్నారు. తన నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అయితే మేయర్ నివాసానికి సమీపంలో వీఆర్డీఎస్ రోడ్డుకు సర్వీసు రోడ్డుకు మధ్యలో 10 మీటర్ల వెడల్పున గ్రీన్ బెల్ట్ ఉంది. అలాంటి గ్రీన్ బెల్టును ఎవరైనా కాపాడుకోవాలి అని చూస్తారు. ముఖ్యంగా విశాఖ నగర పాలక సంస్థకు మేయర్ అయ్యి ఉండి కూడా ఆమె మాత్రం భిన్నంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ఆ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్ కు కేటాయించాలని మేయర్ కుటుంబం కోరింది. అధికారులు వెనుకాముందు ఆలోచించకుండా 150 మీటర్ల పొడవునా గ్రీన్ బెల్ట్ జేసీబీతో తవ్వేసి లెవెల్ చేసేశారు. ఇందుకోసం ఆ ప్రాంతాల్లో ఉన్న పదుల సంఖ్యలోకి చెట్లను నరికేశారు. దీంతో విశాఖ వాస్తలు, విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. చెట్లను కాపాడాల్సిన నేతలు.. వాటిని నరికివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న విశాఖలో.. అది కూడా గ్రీన్ బెల్ట్ ఏరియాలో మొక్కలు తొలగించడం ఏంటని మండిపడుతున్నారు.

    మేయర్ మాత్రం తాను చేసింది తప్పు కాదు అంటున్నారు. రోడ్డుమీద అందరూ పార్కింగ్ చేసుకోవడంతో, ట్రాఫిక్ తీవ్ర సమస్య ఏర్పడుతోందని.. తాము క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో, వచ్చే అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అమె అన్నారు. అందుకే బెల్ట్ లో కొన్ని చెట్లను మాత్రమే తాము తొలగించామని, పార్కింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మిగతా చెట్లను నాటి.. యధావిధిగా వేసి పార్కుల అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు కోసమే, ట్రైలర్ గా దీనిని చేశామని, ఇది సక్సెస్ అయితే కొండవాలు ప్రాంతమంతా ఇదే విధంగా తీర్చిదిద్దాలని ఆలోచన ఉందని అన్నారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని మేయర్ చెప్తున్నారు. అయితే దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, గ్రీన్ బెల్ట్ తొలగించడం సరైంది కాదని, తొలగించిన అధికారుల మీద చర్యలు ఉంటాయంటూ జివిఎంసి కమిషనర్ చెబుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published: