news18-telugu
Updated: December 1, 2018, 7:48 PM IST
ఉత్తమ్ కుమార్, కేసీఆర్ (ఫైల్ ఫొటో)
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల నుంచి దండుకున్న కమీషన్ డబ్బులతో.. ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. అవినీతిమయమైన టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు.
హుజుర్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ ఒక జోకర్, బ్రోకర్ అన్నారు. అలాంటి వ్యక్తి.. జనాల సొమ్ము తిని అహంకారంతో సోనియా, రాహుల్‌లపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుకు, మద్యానికి ఆశపడి మరోసారి టీఆర్ఎస్ కు ఓటెయ్యొద్దని ప్రజలను కోరారు.
టీఆర్ఎస్ను బొందపెట్టే సమయం ఆసన్నమైందని, కేసీఆర్ ప్రభుత్వానికి గోరి కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. తాజాగా అందిన సర్వేల ప్రకారం ప్రజాకూటమి 80 సీట్లకు పైగా గెలుచుకుంటుందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి 30 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. డిసెంబర్ 11న ఫలితాలు విడుదలయ్యాక, డిసెంబర్ 12న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.
Published by:
Santhosh Kumar Pyata
First published:
December 1, 2018, 7:48 PM IST