TPCC PRESIDENT REVANTH REDDY SLAMS CM KCR FOR NOT CONSIDERING CROP LOSS IN TELANGANA DUE TO HEAVY RAINS AK
Revanth Reddy: హుజూరాబాద్ కోసం రూ. 3 వేల కోట్ల ఖర్చు.. కేసీఆర్పై మండిపడ్డ రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Revanth Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలవాలన్న పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్కు రైతులకు వెయ్యి కోట్లు సాయం చేయాలన్న ధ్యాస లేకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ 24 గంటలూ హుజూరాబాద్ ఎన్నికలలో గెలుపు కోసం ఎత్తులు జిత్తులు వేసుకునే పనిలో మునిగిపోయారని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకోసం మూడు వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా సిద్ధమయ్యారని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలవాలన్న పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్కు రైతులకు వెయ్యి కోట్లు సాయం చేయాలన్న ధ్యాస లేకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందన్న రేవంత్ రెడ్డి.. గతంలో ఇలాంటి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి, క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయించి, రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకునేవని అన్నారు.
అయితే సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఎన్నడూ చేపట్టిన దాఖలాలు లేవని ఆరోపించారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాలను అటకెక్కించారని... కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుబంధు సొమ్ములు రైతులు చేసిన రుణాలకు వడ్డీగా జమవుతూనే ఉన్నాయని అన్నారు.
భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పంటల బీమా అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని.. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.