TPCC DISCIPLINARY COMMITTEE CHAIRMAN CHINNA REDDY COMMENTS ON CONGRESS MLA JAGGA REDDY AK
Telangana Congress: జగ్గారెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
Telangana Congress: జగ్గారెడ్డి సోనియాగాంధీకి రాసిన లేఖ ఎలా విడుదల అవుతుందని చిన్నారెడ్డి అన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇటీవల రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తామని అన్నారు. జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించారని భావిస్తున్నామని అన్నారు. జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవడం తమ పరిధిలోని అంశం కాదని వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి సోనియాగాంధీకి రాసిన లేఖ ఎలా విడుదల అవుతుందని అన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని చిన్నారెడ్డి అన్నారు.కొద్దిరోజుల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి.. ఈ అంశంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. తమతో చర్చించలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆయనపై ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును ప్రశ్నిస్తూ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విడి విడిగా లేఖ రాశారు. తన స్వంత జిల్లా ఉమ్మడి మెదక్‌లో పార్టీ తరపున రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారని... సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి లో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రకటించడంతో పాటు రేవంత్ రెడ్డి స్వయంగా హాజరవుతానని తెలిపారని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం విషయంలో మాట మాత్రమైనా తనకు చెప్పలేదని జగ్గారెడ్డి అన్నారు.
జగ్గారెడ్డి తన లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం లేదని కేవలం సొంత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారని అన్నారు. రచ్చబండ అంశం కూడా పార్టీలో చర్చించకుండా స్వంతంగా తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారని పేర్కొన్నారు. ఆయన సీనియర్లతో అంటిముట్టనట్లంగా ఉంటున్నారని.. పార్టీలో ముఖ్యనేతల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని లేఖలో ప్రస్తావించారు. పార్టీ బలోపేతం అంశాన్ని పక్కన పెట్టి.. పార్టీ ని కార్పొరేట్ కంపెనీ మాదిరిగా నడిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలను లేఖలో ప్రస్తావించారు జగ్గారెడ్డి.
మరోవైపు ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేఖ విషయాన్ని సీనియర్లు సైతం సమర్థించారు. జగ్గారెడ్డి సొంత జిల్లాకు వెళుతూ ఆయనకే ఇవ్వకపోతే ఎలా అని వీహెచ్ వంటి నేతలు ప్రశ్నించారు. అయితే జగ్గారెడ్డి లేఖ మీడియాలో లీక్ అయ్యింది. ఈ లేఖ మీడియాకు ఎలా అందిందో తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అందులో అంశాలన్నీ నిజమేనని అన్నారు. తాజాగా ఈ లేఖ వ్యవహారంపై టీపీసీసీ దృష్టి పెట్టడంతో.. ఈ అంశం ఎటు వెళుతుందో అనే ఆసక్తి నెలకొంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.