news18-telugu
Updated: November 18, 2020, 8:14 PM IST
ప్రతీకాత్మక చిత్రం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను రిలీజ్ చేసింది. 29 మందితో తొలి జాబితాను ప్రకటించింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను రిలీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ ఈ రోజు (నవంబర్ 18) నుంచే ప్రారంభం అయింది. నవంబర్ 20తో ముగుస్తుంది. అంటే, కేవలం ఇంకా రెండు రోజులు మాత్రమే నామినేషన్ కోసం గడువు ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ త్వరితగతిన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ప్రకటించింది.
2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లలో మాత్రమే గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ నుంచి 99 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఎంఐఎం 44 సీట్లలో గెలిచింది. టీడీపీ కేవలం ఒక్కచోట గెలుపొందింది. బీజేపీ 4 సీట్లలో విజయం సాధించింది. ఒకప్పుడు గ్రేటర్‌పై జెండా ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీ నేతలు అందర్నీ కారెక్కించింది. ఇంక కొద్దో గొప్పో మిగిలిన నేతలను కూడా కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌తో బీజేపీలో చేర్చుకుంటోంది.

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మందితో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, నియోజవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్‌లు కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరు కూడా బీజేపీలో చేరనున్నారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శేరిలింగపల్లి అసెంబ్లీ టికెట్‌ను బిక్షపతి యాదవ్ ఆశించారు. అయితే కాంగ్రెస్-టీడీపీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీ అభ్యర్థికి కేటాయించారు. తనకు టికెట్ దక్కకపోవడంతో భిక్షపతి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పార్టీకి షాక్ ఇస్తూ.. బీజేపీలో చేరనున్నారు.

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మందితో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అదే బాటలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి ప్రయాణించారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ఆమె బీజేపీలో చేరారు.
GHMC Election Scheduleనామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 18
నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ: నవంబర్ 20
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 21
నామినేషన్ల విత్ డ్రా: నవంబర్ 22, సాయంత్రం 3 గంటల వరకు
తుది జాబితా ప్రకటన: నవంబర్ 22 సాయంత్రంఎన్నికల తేదీ: డిసెంబర్ 1 ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
రీ పొలింగ్(అవసరమైన చోట మాత్రమే): డిసెంబర్ 3
కౌంటింగ్: డిసెంబర్ 4 ఉదయం 7 గంటల నుంచి
పోలింగ్ స్టేషన్ల వివరాలు:
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 9238(నవంబర్ 21న తుది జాబితా)
సమస్యాత్యక పోలింగ్ స్టేషన్లు: 1439
అత్యంత సమస్యాత్మకం: 1004
మొత్తం వార్డులు: 150
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 18, 2020, 7:59 PM IST