కాంగ్రెస్‌ను మోసం చేసినోడు కసబ్‌తో సమానం -Huzurabad బకరా హరీష్ రావు: Revanth Reddy

హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి

Revanth reddy in Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ద్రోహుల్ని పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చారు. హుజూరాబాద్ లో పెద్ద బకరాగా మిగిలిపోయేది మంత్రి హరీశ్ రావేనని ఎద్దేవా చేశారు. వివరాలివి..

  • Share this:
తెలంగాణలోని అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బాల్మూరి వెంకట్ ఇవాళ భారీ హంగామా నడుమ నామినేషన్లు వేశారు. మూడు పార్టీలూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. బాల్మూరును బలపరుస్తూ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ర్యాలీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార టీఆర్ఎస్ నేతలపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీశ్ రావుపై, ఫిరాయింపు నేత కౌశిక్ రెడ్డిపై పదునైన విమర్శలు చేశారు. టీఆర్ఎస్-బీజేపీ ఒకేతాను ముక్కలని, కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. వివరాలివి..

అతను కసబ్ తో సమానం..
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుతం హుజురాబాద్ నియోజవకర్గ టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు. ‘పాపం.. టీఆర్ఎస్‌లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నాడు. అటు పదవీ రాలే.. ఇటు పైసలూ దక్కలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. కాంగ్రెస్ ను మోసం చేసినవాడు కసబ్ తో సమానం’అని రేవంత్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్ లో చేరడం, వెంటనే ఆయనకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని సైతం ఆఫర్ చేసినా, గవర్నర్ అభ్యంతరంతో పదవి ఇంకా ఖరారు కాలేదు. కౌశిక్ ను ఉద్దేశించి రేవంత్ కామెంట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాగే,

కేంద్రంతో కేసీఆర్ పోరు వట్టిదే
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో సీఎం కేసీఆర్ పోరాడుతున్నారనేది వట్టి భ్రమే అని రేవంత్ రెడ్డి చెప్పారు. కమలం, గులాబీ పార్టీల మధ్య చాలా రకాల సంబంధాలున్నాయని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు రకాల అవసరాల కోసమే మోదీ, అమిత్ షాలు కేసీఆర్‌ను దగ్గరకు తీస్తున్నారని తెలిపారు. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు కాబట్టే తెలంగాణలో కేసీఆర్ ఎంత అవినీతి చేసినా చిన్న దర్యాప్తునకు కూడా కేంద్రం ముందుకు రావడంలేదని రేవంత్ గుర్తుచేశారు. అంతేకాదు,

హుజూరాబాద్ బకరా హరీశ్ రావు..
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దోస్తీకి చాలా ఉదాహరణలు ఉన్నాయని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానాన్ని కేసీఆరే ఏర్పాటు చేయించాడన్న సంగతి అందరికీ తెలుసేనని రేవంత్ అన్నారు. కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడని, ఏ లెక్కన చూసినా హుజూరాబాద్ ఉప ఎన్నికలో పెద్ద బకరా అయ్యేది మంత్రి హరీష్ రావే అని రేవంత్ ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లో ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే తను బండి సంజయ్‌కు ప్రమాదమని, ఆ తర్వాత కిషన్ రెడ్డికీ మేకవుతాడని రేవంత్ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతామని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రజల్ని కోరుతామని రేవంత్‌ రెడ్డి అన్నారు.
Published by:Madhu Kota
First published: