వందలాది మంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం బీహారీల చేతిలో బందీ అయిందన్న మాటలు వాస్తవమేనంటూ సమర్తించుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో పనిచేస్తోన్న బీహారీ ఐఏఎస్, ఐపీఎస్‌లపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. అసలు కల్వకుంట్ల పూర్వీకుల మూలాలూ కూడా బీహార్ లోనే ఉన్నాయని, ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే వెల్లడించారని చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ ఎంటరైన తర్వాత టీకాంగ్రెస్ అధినేత బీహారీలపై స్వరాన్ని పెంచారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పెనువివాదాలకు ఆస్కారమున్న షాకింగ్ కామెంట్లు చేశారిలా..
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వందలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ సాధించుకున్నామని.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక అధికారులకు పరిపాలనలో అవకాశాలు ఇవ్వడం లేదని, బిహార్‌కు చెందిన ఐఏఎస్‌లను ఒక రక్షణ వలయంగా చేసుకుని సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ మూలాలు బీహార్‌లో ఉన్నాయని, కల్వకుంట్ల కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చిందన్నారు. ఈ విషయాన్ని 2008లో కేసీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారని, అయినాకూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు 2 సార్లు అధికారం ఇచ్చారన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావం, అనుమానం మొదలైందని, సీఎం కేసీఆర్ వ్యవహారశైలి కూడా అనుమానాలను మరింత బలపర్చేలా ఉందని రేవంత్ అన్నారు. చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు.. రజత్‌కుమార్, అరవింద్‌కుమార్, సందీప్‌కుమార్, సుల్తానియా.. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో అతి కీలక స్థానాల్లో ఉన్న బ్యూరోక్రాట్లంతా బీహార్ వాళ్లేనని, ఇతర కీలక శాఖల్లో బీహార్ అధికారులకు సీఎం పెద్దపీట వేశారని ఆరోపించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇక్కడి ఐఏఎస్‌లకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.
‘అక్రమాలకు సహకరించే ఐఏఎస్‌లకు కేసీఆర్ కీలక పోస్టులు ఇస్తున్నారు. సోమేశ్ కుమార్ బల్దియా కమిషనర్ గా గ్రేటర్ హైదరాబాద్‌లో 30లక్షల ఓట్లను తొలగించారు. అందుకే ఆయనకు సీఎస్ పోస్టు కట్టబెట్టారు. రాష్ట్రం మొత్తాన్ని బిహారీల చేతిలో బందీగా మార్చారు. తెలంగాణ ప్రాంత అధికారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. బిహార్ ఐఏఎస్ అధికారులపై నిఘా ఉండాలి. సీఎస్ సోమేశ్‌కుమార్ తీరుతో ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా తయారైంది. ధరణిలో సమస్యల కారణంగా భూతగాదాలతో హత్యలకు దిగుతున్నారు..’అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు,
సీఎం కేసీఆర్ కు ఎన్నికల స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చిన తర్వాత బీహార్ సంబంధిత వాదన, వ్యాఖ్యలకు మరింత పదునుపెట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గత వారం కూడా ఆయన ‘బీహారీ ముఠా చేతిలో తెలంగాణ బందీ అయింద’ని కామెంట్లు చేయగా, అవి జాతీయ స్థాయిలో రర్చకు దారి తీశాయి. బీహార్ కేబినెట్ మంత్రి, జేడీయూ నేత సంజయ్ కుమార్ ఝా.. టీకాంగ్రెస్ చీఫ్ పై నిప్పులు చెరిగారు. బుద్ధుడు, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు జన్మించిన నేల బీహార్ అని, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులపై రేవంత్ నోరు పారేసుకోవడాన్ని ఖండిస్తున్నానని ఝా సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇవాళ్టి ప్రెస్ మీట్ లో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ, బీహార్‌కు చెందిన మంత్రి సంజయ్‌కుమార్ ఝూ తనపై దాడి చేస్తున్నారని, కేసీఆర్ కు ఎన్డీఏ కవచంగా ఉంటోందని రేవంత్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, CM KCR, Congress, Revanth Reddy, Telangana