తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంతో కొంత ఆధిక్యత ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్... అదే ఊపుతో తెలంగాణలో హైదరాబాద్ మినహా 16 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. పలు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడక లాగే కనిపిస్తున్నా... కొద్ది చోట్ల మాత్రం ఆ పార్టీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అలాంటి స్థానాల్లో చేవేళ్ల కూడా ఒకటి. చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ పడుతుండటమే ఇందుకు కారణం.
గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కార్తీక్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి... ప్రస్తుతం కాంగ్రెస్ తరపున మరోసారి చేవేళ్ల ఎంపీగా బరిలో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డిని ఎదుర్కోవడానికి మరో పారిశ్రామిక వేత్త అయిన రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని బరిలో నిలిపింది టీఆర్ఎస్. చేవేళ్ల పరిధిలో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆయన తనయుడు కార్తీక్ రెడ్డి కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్లో చేరడం గులాబీ పార్టీకి కలిసొచ్చే అంశం.
అయితే మరోసారి చేవెళ్లలో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి... కొన్ని నెలల క్రితం నుంచే నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం, బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం, నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం విశ్వేశ్వర్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. మరోవైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించి చేవెళ్లలో సభను నిర్వహించి ఓటర్లను ఆకర్షించాలని ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న రంజిత్ రెడ్డికి కూడా కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.
రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండటం, నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలంతా ఆయన విజయం కోసం కష్టపడుతుండటం రంజిత్ రెడ్డికి పాజిటివ్ అంశాలుగా చెప్పొచ్చు. అయితే ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కూడా బరిలో ఉండటం... రెండు పార్టీలను టెన్షన్ పెడుతోంది. బీజేపీ తరపున బండారు దత్తాత్రేయ వియ్యంకుడు జనార్ధన్ రెడ్డి చేవెళ్ల నుంచి బరిలో ఉన్నారు. చేవెళ్ల సీటు మీదే అని బీజేపీ పెద్దలు హామీ ఇవ్వడంతో ఎప్పటి నుంచో చేవెళ్లలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉండటంతో... బీజేపీ ఎన్ని ఓట్లను సాధిస్తుంది ? ఎవరి ఓట్లను కొల్లగొడుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటే... బీజేపీ చీల్చే ఓట్లే ఈ రెండు పార్టీల గెలుపోటములను నిర్దేశిస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న చేవెళ్ల పోటీలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Chevella S29p10, Congress, Lok Sabha Election 2019, Telangana Lok Sabha Elections 2019, Trs