రోజాకు మంత్రి పదవి అంత ఈజీ కాదు... ఎందుకో తెలుసా ?

చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ సీనియర్ నేతలు, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనేక మంది మంత్రి పదవి కోసం రోజాతో పోటీ పడుతున్నారు. దీంతో రోజాకు మంత్రి పదవి దక్కడం అంత ఈజీ కాదనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: April 16, 2019, 1:07 PM IST
రోజాకు మంత్రి పదవి అంత ఈజీ కాదు... ఎందుకో తెలుసా ?
వైసీపీ ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
రాజకీయాల్లోకి వచ్చిన నేతలకు మంత్రి కావాలనేది ఓ కల. ఇందుకోసం నేతలు ఎంతగానో కష్టపడుతుంటారు. తాము గెలిచి, తమ పార్టీ అధికారంలోకి వస్తే... ఇక మంత్రి పదవి దక్కించుకోవడమే టార్గెట్‌గా నేతలు వ్యూహరచన చేస్తుంటారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా మంత్రి పదవి కోసం అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతుండటంతో... తనకు మంత్రి పదవి ఖాయమని రోజా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తనకు ఈ సారి ఏకంగా హోంమంత్రి పదవి దక్కుతుందని ఆమె చెబుతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీ ఆవిర్భావం నుంచి... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న రోజాకు మంత్రి పదవి రావొచ్చనే భావనలో చాలామందిలో ఉన్నారు. అయితే వైసీపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం రోజాకు మంత్రి పదవి దక్కడం అంత ఈజీ కాదని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అసలు కారణంగా ఆమె సామాజిక నేపథ్యం, ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లానే అని విశ్లేషిస్తున్నారు.


చిత్తూరు జిల్లా నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రోజా... మరోసారి ఇక్కడి నుంచి గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ సీనియర్ నేతలు, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనేక మంది మంత్రి పదవి కోసం రోజాతో పోటీ పడుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే వైసీపీ తరపున చిత్తూరు జిల్లా నుంచి మంత్రిగా ఎంపికయ్యే తొలి అవకాశం దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రామచంద్రారెడ్డితో పాటు ఆయన తనయుడు మాజీ ఎంపీ మిథున్ రెడ్డితో జగన్‌కు ఉన్న సాన్నిహిత్యమే ఇందుకు అసలు కారణం.

ఇక చంద్రగిరి నుంచి మరోసారి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఈయన కూడా జగన్‌కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం జగన్ కేబినెట్‌లో చోటు కోసం పోటీ పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
రోజాతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో... వీరితో పోటీపడి రోజా మంత్రి పదవి దక్కించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మహిళా కోటాలో రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున బలంగా తన వాయిస్ వినిపించిన రోజాను జగన్ కచ్చితంగా తన కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
First published: April 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>