TOLLYWOOD HERO BALAKRISHNA READY TO CAMPAIGN FOR TIRUPATHI BY POLL TDP RELEASE STAR CAMPAIGNERS LIST NGS
Andhra pradesh: తిరుపతిలో ప్రచారం చేయనున్న బాలకృష్ణ.. బాలయ్యతో పాటు స్టార్ క్యాంపైనర్ల జాబితా ఇదే
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బాలయ్య
బాలయ్యపై టీడీపీ అధిష్టానం భారీగా ఆశలు పెట్టుకుంది. అందుకే తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బాధ్యతను బాలయ్యకు అప్పగించింది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేయనున్న 30 మంది స్టార్ క్యాంపైనర్ల జాబితాను టీడీపీ విడుదల చేసింది.
తిరుపతి ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఉప ఎన్నిక గెలుపు కోసం అన్ని పార్టీలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. భారీ మెజార్టీనే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపొంది ఉనికి కాపాడుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. అటు ఈ ఉప ఎన్నికతో తమ సత్తా చాటి.. ఏపీలో అడుగు పెట్టాలని బీజేపీ భావిస్తోంది. జనసేన మద్దతు ఉండడంతో గెలుపుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. జనసేన, బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా లాభం లేదని వైసీపీ అంటుంటే.. ఫ్యాన్, సైకిల్ పార్టీలు అధికారం కోసం కోట్లు కుమ్మరిస్తున్నాయని కమలం పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో జెండా పాతాల్సిందే. ఇదే ఇప్పుడు ఏపీలోని ప్రధాన పార్టీల ప్రయత్నం. సిట్టింగ్ సీటే కాబట్టి.. గెలుపు నల్లేరుపై నడకేనని అంటోంది అధికార వైసీపీ.
తిరుపతి ఉప ఎన్నికపై అతి విశ్వాసం వద్దని అధినేత జగన్ ఇప్పటికే తమ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు కూడా. భారీ మెజారిటీని టార్గెట్ కూడా పెట్టారు. అక్కడ వచ్చే మెజారిటీతో దేశమంతా రీసౌండ్ రావాలని నేతలకు సీఎం జగన్ సూచించారు. అందుకు తగ్గట్టే పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని నియమించి వైసీపీ ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. మరోవైపు తమ కాబోయే సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తిరుపతి ఉప్ప ఎన్నికకు ఏపీ సీఎం అభ్యర్థికి ఏం సంబంధమని ప్రశ్నిస్తోంది. పవన్ తలకిందులుగా పాద యాత్ర చేసినా సీఎం కాలేరని కౌంటర్లు వేస్తోంది.
బీజేపీ, వైసీపీ తీరుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మండిపడుతోంది. అధికార వైసీపీ తరపున సార్వత్రిక ఎన్నికల్లో 22 మంది ఎంపీలను గెలిపిస్తే.. రాష్ట్రానికి ఏం చేశారో జగన్ చెప్పాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తుతం జగన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరిస్తామంటుంటే.. వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఇలా విమర్శల పదును పెంచిన టీడీపీ.. త్వరలోనే స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దించుతోంది.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ఆ పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీడీపీ సిద్ధం చేసింది. ఆ జాబితాను ఎన్నికల సంఘానికి పంపింది. ఈసీకి పంపిన ఆ జాబితాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ సహా 9 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, ఐదుగురు ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.