Tollywood Meeting: సీఎం జగన్ కు ఏం చెప్పాలి..? సినీ సమస్యలపై పెద్దల సమావేశం

సినీ పెద్దల సమావేశం

ఏపీ ప్రభుత్వానికి -టాలీవుడ్ కు మధ్య గ్యాప్ తగ్గేనా..? ఈ నెల ఆఖరులో సీఎం జగన్ తో ఏఏ అంశాలు చర్చించాలి.. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అన్నదానిపై టాలీవుడ్ పెద్దలు ట్రయల్స్ వేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలంతా సమావేశమయ్యారు. ఏ అంశాలపై చర్చించారంటే..?

 • Share this:
  ఏపీ ప్రభుత్వానికి-టాలీవుడ్ కు మధ్య గ్యాప్ పూడ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సినీ పెద్దలు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ దగ్గర నుంచి టాలీవుడ్- ఏపీ సర్కార్ మధ్య గ్యాప్ మొదలైంది. టికెట్ల ధర తగ్గించడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి సినీ పెద్దలు ఎన్ని సార్లు సీఎంను కలిసే ప్రయత్నం చేసినా.. అపాయింట్ మెంట్ దొరకలేదు. అసలు వారితో చర్చలు జరిపేందుకు సీఎం జగన్ ముందుకు రాలేదు. ఆ తరువాత కూడా సినిమా పెద్దలు వద్దని కోరుకుతున్న.. వాటిని ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. వారికి వ్యతిరేకంగా జీవోలు కూడా ఇస్తూ వచ్చింది. ఇక థియేటర్లు తెరిచే విషయంలోనూ, షోలు పెంచే విషయంలోనూ సినీ పరిశ్రమ డిమాండ్లను ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో ఏపీలో సినిమాలు రిలీజ్ చేయలేమని పలువురు డిస్ట్ర్రిబ్యూటర్లు చేతులు ఎత్తేశారు. నిర్మాతలు సైతం థియేటర్లలో సినిమా రిలీజ్ చేయడం కంటే.. ఓటీటీలే బెటర్ అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వానికి-టాలీవుడ్ కు వివాదం సద్దుమణగకపోతే థియేటర్లను కన్వెన్షన్ సెంటర్లుగా మార్చడమే బెటరని చాలామంది థియేటర్ల యజమానులు బహిరంగంగానే చెబుతూ వచ్చారు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది అనుకుంటున్న సమయంలో.. అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం నుంచి చిరంజీవికి ఆహ్వానం వచ్చింది. ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి.. సినీ పెద్దలతో కలిసి సమస్యలు చర్చించడానికి రావాలి అంటూ ఫోన్ లో పేర్ని నాని కోరారు.. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందని సినీ కార్మికులు, పరిశ్రమపై ఆధారపడే వారు ఆశిస్తున్నారు..

  ముఖ్యంగా క‌రోనా క్రైసిస్ నేప‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ స‌మస్య‌ల‌పైనా.. అలాగే ఆంధ్రప్ర‌దేశ్ లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య‌ల‌పైనా చ‌ర్చించేందుకు సీఎం జగన్ నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో సీఎంతో ఏఏ అంశాలు ప్రస్తావించాలి.. తమ సమస్యలను ఎలా ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి.. అన్నది ముందుగానే ప్రణాళిక ప్రకారం చర్చించుకుని వెళ్తే బెటరని సినీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈ భేటీలో సీఎంకి విన్న‌వించాల్సిన అన్ని విష‌యాల‌పైనా కూలంకుశంగా చ‌ర్చించి వెళ్లాల‌న్న ఉద్దేశంతో ఇండ‌స్ట్రీ మీటింగ్ హైద‌రాబాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జ‌రిగింది. 

  మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, కే.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్ అలాగే దర్శకులు కొరటాల శివ, వి.వి.వినాయక్.. ఇతర సినీ పెద్దలు జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి బాబీ యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ, ఆర్ నారాయణ మూర్తి,నిర్మాత‌ల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల ఏపీలో వ‌చ్చిన జీవోలో ఉన్న‌వాటిపై చ‌ర్చించారు. సీఎంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాలేమిటి? అన్న‌దానిపై చ‌ర్చించారు. అన్నిటినీ త్వరగా ప‌రిష్క‌రించాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్. చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌పైనా సీఎంతో భేటీలో చ‌ర్చించ‌నున్నారు.  ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్టు రేట్ల‌పై చ‌ర్చించ‌నున్నారు. గ్రామ పంచాయితీ, న‌గ‌ర పంచాయితీ, కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ఏం అడ‌గాలి? చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో విషయమై ఎలా ఒప్పించాలి అన్న అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిలపై సానుకూల వాతావరణం వచ్చేలా అవన్నీ ఓ కొలిక్కి వచ్చేలా అందరూ కలిసి చర్చించుకున్నారు. అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి కూలంకుషంగా చర్చించడం ఈ సమస్యలు పరిష్కారం కోసం చర్చించుకోవడం జరిగింది.
  Published by:Nagesh Paina
  First published: