#YogiToNews18 | యూపీ సీఎం పదవి అలా వచ్చింది: యోగి ఆదిత్యనాథ్

మరునాడు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకున్నానని, తాను సీఎం కాబోతున్నట్లు అమిత్ షా చెప్పారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

news18-telugu
Updated: September 19, 2019, 12:41 PM IST
#YogiToNews18 | యూపీ సీఎం పదవి అలా వచ్చింది: యోగి ఆదిత్యనాథ్
యోగి ఆదిత్యనాథ్
  • Share this:
అది 2017 మార్చి నెల.. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న రోజులు.. యావత్తు దేశం ఆ రాష్ట్రం ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా చూస్తోంది.. గెలిచాక ఎవరు సీఎం అవుతారు? అన్న ప్రశ్నే అందరిలోనూ. సర్వేలు, అంచనాలకు తగ్గట్లుగానే బీజేపీ జయకేతనం ఎగురవేసింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. రాజకీయ విశ్లేషకులకు ఒకింత ఆశ్చర్యం వేసింది. వారు ఆశ్చర్యంలో ఉండగానే తనదైన పాలనతో దూసుకుపోతూ మరింత ఆశ్చర్యానికి గురిచేశారాయన. అలా.. రెండున్నరేళ్లు గడిచిపోయాయి. మరి సీఎం పదవి ఎలా వచ్చింది? అప్పటి పరిస్థితులు ఏంటి? అని ఆయన్నే స్వయంగా నెట్‌వర్క్18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో జరిగిన ఇంటర్వ్యూలో కీలక అంశాలు వెల్లడించారు. ‘అసలు నేను సీఎం రేసులోనే లేను. ఉంటానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. పార్టీ పంపిన చోటుకు వెళ్లి ప్రచారం నిర్వహించా’ అని ఆయన తెలిపారు.

అప్పటికి తాను గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నందున, ఫిబ్రవరి 25న అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఫోన్ చేసి.. పార్లమెంటరీ బృందంతో పాటు పోర్ట్ లూయిస్‌కు వెళ్లాలని, మార్చి 8న ఢిల్లీకి రావాలని చెప్పారని చెప్పారు. అన్నట్లుగానే.. యూపీలో ఎన్నికలు 8న ముగియడంతో తాను ఢిల్లీకి వెళ్లి పాస్‌పోర్ట్ పీఎంవోకు అందజేశానని వెల్లడించారు. అయితే, పీఎంవో అధికారులు మార్చి 10న ఆ పాస్‌పోర్టు తనకు ఇచ్చేసి.. ఎక్కడికి వెళ్లనవసరం లేదని చెప్పినట్లు ఆ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మళ్లీ సుష్మా స్వరాజ్ ఫోన్ చేసి.. ‘మీరు కౌంటింగ్ రోజు(మార్చి 13)న కచ్చితంగా యూపీలో ఉండాల్సిన అవసరం ఉంది.’ అని చెప్పారని, సరేనని తాను గోరఖ్‌పూర్‌లోనే ఉన్నానని వివరించారు.

మార్చి 16న పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వెళ్లా. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి.. ఢిల్లీ వదిలి వెళ్లొద్దని, మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పడంతో సరేనని అన్నా. కానీ, అక్కడ ఏం పని లేకపోవడంతో గోరఖ్‌పూర్‌కు వచ్చేశా. అదే రోజు సాయంత్రం అమిత్ షా మళ్లీ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగారు. నేను గోరఖ్‌పూర్‌కు వచ్చేశానని చెప్పా. దీంతో ఆయన.. వెంటనే ఢిల్లీ రండి. మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అన్నారు. అయితే.. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లేందుకు రైలు గానీ, విమానం గానీ లేకపోవడంతో కొంత సంశయించా. అమిత్ షా కలుగజేసుకొని.. రేపు ఉదయం చార్టెడ్ ఫ్లైట్ పంపిస్తున్నా. అందులో రండి అని చెప్పారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
తాను మరునాడు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకున్నానని, తాను సీఎం కాబోతున్నట్లు అమిత్ షా చెప్పారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ‘ఇదే విమానంలో లక్నో వెళ్లండి. సాయంత్రం 4 గంటలకు మిమ్మల్ని ఎమ్మెల్యేలు వాళ్ల లీడర్‌గా ఎన్నుకుంటారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారం.’ అని అమిత్ షా తనతో అన్నట్లు ఇంటర్వ్యూలో యోగి వెల్లడించారు. ఆ తర్వాత 18న యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>