Home /News /politics /

TODAY LAST DAY FOR ELECTION CAMPAIGN IN ANDHRA PRADESH SB

సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం...కీలక నియోజకవర్గాలకు అధినేతలు

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్(File)

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్(File)

ఏపీలో ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. దీంతో నెలరోజులుగా చేస్తున్న ప్రచారానికి నేతలు పుల్ స్టాప్ పెట్టనున్నారు.

    ఏపీలో ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అధినేతలు కీలక నియోజకవర్గాలవైపు కదులుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ కూడా ఇవాళ రాజధాని నియోజకవర్గాల్లో ప్రచారం చేయనుండగా... జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాను, అన్నయ్య నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం నియోజకవర్గం పరిధిలో ప్రచారానికి ప్లాన్ చేశారు. ఏపీలో ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. దీంతో నెలరోజులుగా చేస్తున్న ప్రచారానికి నేతలు పుల్ స్టాప్ పెట్టనున్నారు. చివరిరోజు మాత్రం కీలక నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్రధాన పార్టీల నేతలు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. తనకు అత్యంత కీలకమైన రాజధాని ప్రాంతంలోని గురజాల, సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. గురజాలలో టీడీపీ అభ్యర్ధి యరపతినేని శ్రీనివాస్ గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటున్నారన్న నేపథ్యంలో చంద్రబాబు చివరిరోజు ఇక్కడ రోడ్ షో కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే స్పీకర్ కోడెల పోటీ చేస్తున్న సత్తెనపల్లిలోనూ గెలుపు టీడీపీకి కీలకంగా మారింది. అలాగే రాజధాని పరిధిలోని మరో నియోజకవర్గం తాడికొండలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో చంద్రబాబు చివరిరోజు ఈ మూడు సీట్లలో ప్రచారం చేస్తున్నారు.

    నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం


    అలాగే వైసీపీ అధినేత జగన్ కూడా చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఇవాళ తన ప్రచారం ప్రారంభిస్తారు. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి ఆర్కేను గెలిపించుకోవడం జగన్ కు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో జగన్ ఓటర్లను అభ్యర్ధించేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరిలో ప్రచారం తర్వాత జగన్ కర్నూలు.. అక్కడి నుంచి తిరుపతి వెళ్లనున్నారు. గత ఎన్నికల్లో కర్నూలు సీటును గెలిచినా ఎస్వీమోహన్ రెడ్డి టీడీపీకి ఫిరాయించడంతో ఈసారి వైసీపీ ఇక్కడ మైనార్టీ నేత హఫీజ్ ఖాన్ ను బరిలోకి దింపింది. ఇక్కడ టీజీ వెంకటేష్ తనయుడు భరత్ ను ఆయన ఎదుర్కొంటున్నారు. అలాగే తిరుపతిలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కూడా జగన్ కు కీలకమే.

    లోకేష్, జగన్
    లోకేష్, జగన్


    అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న భీమవరంతో పాటు నరసాపురం ఎంపీ సీటు పరిధిలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ఇవాళ ప్రచారం చేపడుతున్నారు. భీమవరంలో పవన్ కు గట్టిపోటీ ఎదురవుతున్న నేపథ్యంలో చివరి రోజు జనసేనాని ప్రచారం ఇక్కడ కీలకం కానుంది. అలాగే నరసాపురం ఎంపీ సీటులో తన సోదరుడు నాగబాబును గెలిపించాలని పవన్ ఓటర్లను కోరనున్నారు.

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం


    మరోవైపు జగన్ సోదరి షర్మిల ఇవాళ విజయవాడ ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే విజయవాడ వెస్ట్ తో పాటు మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. గత ఎన్నికల్లో తాము గెలిచిన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉదయం షర్మిల రోడ్ షో ఉంటుంది. అక్కడి నుంచి షర్మిల... మంత్రి దేవినేని ఉమ పోటీ చేస్తున్న మైలవరంతో పాటు పక్కనే ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలోనూ రోడ్ షోలు నిర్వహించనున్నారు. అలాగే జగన్ తల్లి విజయమ్మ రాయలసీమ జిల్లాల్లో చివరి రోజు ప్రచారం చేయనున్నారు.. కర్నూలు జిల్లాలోనూ డోన్, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం సాగిస్తారు. వీరితో పాటు ప్రధాన పార్టీల నేతలంతా ఇవాళ తమకు అత్యంత కీలకమైన సీట్లలో రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

    (సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Chandrababu naidu, Pawan kalyan, Ys jagan mohan reddy

    తదుపరి వార్తలు