జగన్ ఢిల్లీ పర్యటనలో మార్పులు.... చివరి నిమిషంలో కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్

ఇవాళ ఢిల్లీ నుంచి జగన్ తిరుగుప్రయాణం అయ్యారు. ఇంతలోనే కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ కూడా ఖరారు కావడంతో... వెంటనే... ఆయన తన టూర్ షెడ్యూల్ మార్చుకున్నారు.

news18-telugu
Updated: February 15, 2020, 10:43 AM IST
జగన్ ఢిల్లీ పర్యటనలో మార్పులు.... చివరి నిమిషంలో కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. చివరి నిమిషంలో కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దొరకడంతో ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ కానున్నారు. ప్రధానంగా అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయాన్ని ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరగా శాఖల తరలింపునకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. కేంద్ర జలనవరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తో కూడా జగన్ భేటీ అవుతున్నట్లు సమాచారం. ఈ భేటీలో జగన్ పోలవరం పనులకు సంబంధించిన అంశాలతో పాటు.. నిధుల విషయంలో కూడా చర్చలు జరపునున్నట్లు సమాచారం.

బుధవారం ఢిల్లీ వెళ్లిన జగన్ ... ప్రధాని మోదీని కలిశారు. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఏపీకి మూడు రాజధానులు, కర్నూలో హైకోర్టు ఏర్పాటు, మండలి రద్దు తీర్మానంతో పాటు ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలను వివరించారు. ప్రధాని నివాసంలో ఇరువురి మధ్య దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై లేఖను సమర్పించారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని కోరారు సీఎం జగన్. జగన్‌తో పాటు వైసీపీ ఎంపీలు, ఆ పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఎంపీలతో కలిసి సమావేశంలో పాల్గొన్న జగన్.. ఆ తర్వాత కాసేపు ఏకాంతంగా మోదీతో చర్చలు జరిపారు.

ఆ తర్వాత మళ్లీ శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం...  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ అమిత్ షాతో సుమారు అరగంట పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ఎందుకు చేస్తున్నాము?. దానికి కారణాలను వివరించినట్టు తెలిసింది. మూడు రాజధానులు ఏర్పాటైతే హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయశాఖ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే, శాసనమండలి రద్దు అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇటీవల రాజధాని బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడంతో సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. ఇవాళ ఢిల్లీ నుంచి జగన్ తిరుగుప్రయాణం అయ్యారు. ఇంతలోనే కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ కూడా ఖరారు కావడంతో... వెంటనే... ఆయన తన టూర్ షెడ్యూల్ మార్చుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఇద్దరు కేంద్రమంత్రులతో భేటీ అయ్యి... ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించి అనంతరం రాష్ట్రానికి బయల్దేరనున్నారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు