TODAY AMITSHAW TOUR IN TELANGANA FOR ELECTION CAMPAIGN
నేడు తెలంగాణకు అమిత్‌షా, నాలుగు జిల్లాల్లో ప్రచారం
అమిత్ షా(File)
తెలంగాణలో సత్తాచాటాలనుకుంటున్న బీజేపీ, అగ్రనేతలను ఎన్నికల ప్రచార రణరంగంలోకి దింపుతోంది. జాతీయస్థాయి నేతలను ఒక్కొక్కరిగా తెలంగాణలో ల్యాండ్ చేస్తోంది. మొత్తం 50 బహిరంగ సభలు నిర్వహించబోతోంది. ఇవాళ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనతో అగ్రనేతల ప్రచార పర్వం మొదలుకాబోతోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ ఒక్కరోజే నాలుగు జిల్లాల్లో ప్రచార సభలకు హాజరుకానున్నారు. ఉదయం 10.20కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. ఉదయం 11.15కు హెలీకాఫ్టర్లో బయలుదేరి వరంగల్ జిల్లా పరకాల బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.05కు నిర్మల్ చేరుకొని, అక్కడి ప్రిన్స్ హైస్కూల్ ప్లే గ్రౌండ్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. 2.45కు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని అనురాధ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో, సాయంత్రం 4.10కు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వెంకటేశ్వర బీఈడీ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.
సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుని ఎన్టీఆర్ మైదానంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి హాజరవుతారని తెలిసింది. వచ్చే నెల 2, 5 తేదీల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 2న భూపాలపల్లి, ముథోల్, బోధన్, తాండూరు, సంగారెడ్డిల్లో ఏర్పాటుచేసే సభలకు హాజరవుతారు. 5న కరీంనగర్, వరంగల్, గోషామహల్లో ఏర్పాటుచేసే సభల్లో పాల్గొంటారు.
bjp top leaders file photos
ఇదివరకు ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలో దింపిన బీజేపీ... ప్రచారాన్ని కూడా అదే రేంజ్లో సాగిస్తోంది. ప్రధాని మోడీ మూడు సభల్లో, అమిత్‌షా 10 బహిరంగసభలు, రెండు రోడ్ షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేసింది. వీరికి తోడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 8 బహిరంగసభల్లో, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 11 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసింది బీజేపీ. అంతేకాదు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ 4 సభల్లోనూ, సుష్మాస్వరాజ్ ఒక సభలో, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి 4 సభల్లో పాల్గొనేలా ప్రచారషెడ్యూల్ ఖరారైంది. ఇలా.. మొత్తం 50 బహిరంగసభలను ప్లాన్ చేసింది బీజేపీ.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.