TMC MP KALYAN BANERJEE COMPARES NIRMALA SITHARAMAN WITH VENOMOUS SNAKE BJP HITS BACK
ఆమె ఓ విష సర్పం.. నిర్మలా సీతారామన్‌పై TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
విష సర్పం కాటుకు మనుషులు చనిపోయినట్లుగా...ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసమర్థ ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారంటూ టీఎంపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ‘విష సర్పం’తో పోల్చుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC)కి చెందిన ఓ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో నిర్మలా సీతారామన్ ఓ విషసర్పమంటూ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విష సర్పం కాటుకు మనుషులు చనిపోయినట్లుగా...నిర్మల ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారని మండిపడ్డారు. రైళ్లను నడిపే బాధ్యతలను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆర్థిక మంత్రి పదవికి నిర్మల వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల సర్వనాశనం చేశారని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌గా ఆయన పేర్కొన్నారు.
కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తన పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టు కోల్పోయారని పశ్చిమ బెంగాల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వంలో అవినీతి పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకు పెరిగిపోయిందన్నారు. టీఎంసీలో అంతర్గత వైరుధ్యం మొదలైందని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అదే సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. నవ భారతాన్ని నిర్మిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ...జీడీపీ వృద్ధిరేటును అద:పాతాళానికి తోసేశారని ధ్వజమెత్తారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.