#YourLeder: ప్రొఫెసర్‌ టు పొలిటీషియన్‌.. కోదండరాం ప్రస్థానం!

ఒకప్పుడు కేసీఆర్‌ను అందరికంటే ఎక్కువగా సమర్థించిన వ్యక్తి.. ఆ తర్వాతి కాలంలో ఆయన్ను అందరికంటే ఎక్కువగా విమర్శిస్తూ వస్తున్న వ్యక్తి కోదండరాం. ప్రొఫెసర్‌గా, ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజానీకం చేత 'సార్' అని పిలిపించుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎంతమేర తన ప్రభావం చూపించబోతున్నారు?.. ప్రజలు ఆయన రాజకీయాలను ఆదరిస్తారా.. లేక తిరస్కరిస్తారా?..

news18-telugu
Updated: October 18, 2018, 12:22 PM IST
#YourLeder: ప్రొఫెసర్‌ టు పొలిటీషియన్‌.. కోదండరాం ప్రస్థానం!
టీజేఎస్ చీఫ్ కోదండరాం(File)
  • Share this:
కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్‌గా సుపరిచితులు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఏపీ పౌరహక్కుల సంఘం కమిటీలోనూ, మానవ హక్కుల ఫోరంలోనూ కోదండరాం పనిచేశారు. 2004లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులుగా పనిచేశారు. మార్చి 31, 2018లో తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షులుగా సబ్బండ వర్గాలను ఒక్క తాటి పైకి తీసుకురావడంలో కోదండరాం కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన నేత్రుత్వంలో మార్చి 10, 2011న తలపెట్టిన మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు ఆనాడు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ను దిగ్బంధం చేసి 'జై తెలంగాణ' నినాదాలతో హోరెత్తించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో జోడు గుర్రాల్లా సమన్వయంతో పనిచేసిన కేసీఆర్-కోదండరాం మధ్య.. ఆ తర్వాతి కాలంలో విబేధాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 2014 ఎన్నికల సమయంలోనే కోదండరాంకు టీఆర్ఎస్ టికెట్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన నిరాకరించారన్న ప్రచారం ఉంది. ఆ తర్వాత మారిన సమీకరణాల రీత్యా కోదండరాం టీఆర్ఎస్‌పై నిరసన గళం వినిపిస్తూ వచ్చారు. రాజకీయ పార్టీపై ఎన్నో తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున 'కొలువుల కొట్లాట' సభను నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల, కాంట్రాక్ట్.. ఔట్ సోర్సింగ్ విధానం రద్దు, స్థానిక పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు వంటి అంశాలపై ఆయన పోరాడుతూ వస్తున్నారు.


తెలంగాణ జనసమితితో ఇప్పుడు ముందస్తు ఎన్నికల బరిలో దిగుతున్నారు. కేసీఆర్‌ను గద్దె దించడం.. అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్న కోదండరాం.. అదే సారూప్యత ఉన్న కాంగ్రెస్ నేత్రుత్వంలోని మహాకూటమిలో చేరారు. ఈ మహాకూటమికి 'తెలంగాణ పరిరక్షణ వేదిక'గా పేరు పెట్టారు. ఇప్పుడీ వేదికకు ఛైర్మన్‌గా కోదండరాంను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బుద్ది జీవులు, విద్యార్థుల్లో కోదండరాం పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని మహాకూటమికి అనుకూలంగా మలుచుకోవాలంటే ఆయన్ను ఛైర్మన్‌గా నియమించడమే కరెక్ట్ అని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

నిజానికి తెలంగాణలోని 119నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేసి కేసీఆర్‌ను ఓడిస్తామని కోదండరాం అంతకుముందు ప్రకటించారు. కానీ తమ బలాబలాలను విశ్లేషించుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మహాకూటమితో కలిసి వెళ్లడమే సరైందని ఆయన నిర్ణయించుకున్నారు. మహాకూటమితో కలిసి నడిచేందుకు టీజేఎస్ పార్టీకి 25సీట్లు కేటాయించాలని కోదండరాం కూటమి పెద్దలను కోరారు. అయితే కూటమి పెద్దలు మాత్రం టీజేఎస్‌కు కష్టంగా ఐదు సీట్లకు మించి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు.


ఇక ఈ ఎన్నికల్లో కోదండరాం ఎక్కడినుంచి పోటీ చేయబోతున్నారన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. జనగామ లేదా వరంగల్ వెస్ట్ నుంచి ఆయన బరిలో దిగవచ్చుననే ప్రచారం మాత్రం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌కు ఇక్కడ బలమైన అభ్యర్థులే ఉండటంతో ఆయన తన స్వస్థలమైన మంచిర్యాల నుంచే పోటీ చేస్తారేమోనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అక్కడ కూడా కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు టిక్కెట్ ఆశిస్తుండటంతో.. కోదండరాం ఎక్కడినుంచి పోటీ చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. మొత్తం మీద ప్రొఫెసర్‌గా, ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కోదండరాంకి.. రాజకీయాల్లోనూ అదే గుర్తింపు దక్కుతుందా?.. ప్రజలు ఆయనకు సెల్యూట్ కొడుతారా?.. లేక సాగనంపుతారా? అన్నది ఈ ఎన్నికలతో తేలిపోనుంది.

Published by: Srinivas Mittapalli
First published: October 11, 2018, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading