Tirupati ByPolls: తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాదాపు ఖరారు, జగన్ ఫిక్స్

దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఫ్యామిలీకే టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానం భావించినప్పటికీ దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులు పోటీకి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

news18-telugu
Updated: November 19, 2020, 6:36 PM IST
Tirupati ByPolls: తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాదాపు ఖరారు, జగన్ ఫిక్స్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం (File)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. తిరుపతి ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపికపై చర్చిస్తున్నారు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఫ్యామిలీకే టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానం భావించినప్పటికీ దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులు పోటీకి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దాంతో, తిరుపతి ఉపఎన్నిక అభ్యర్ధి కోసం మంత్రులు, ముఖ్యనేతలతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. అయితే, దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకే టికెట్‌ కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దుర్గాప్రసాద్ భార్య లేదా కుమారుడికి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. చివరి సమయంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప వేరే వారికి సీటు కేటాయింపు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక, స్థానిక ఎన్నికలు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహార శైలిపైనా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున బల్లి దుర్గా ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చనిపోయారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1994, 1999, 2009లో నాలుగుసార్లు గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మీద 2.28 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఇక  తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ తరఫున బరిలో నిలపనున్నట్టు ఆ పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వెల్లడించారు. నవంబర్ 16న తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు.. ఉప ఎన్నికలో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యుహంపై ప్రధానంగా చర్చించారు. పనబాక లక్ష్మి గెలుపు కోసం అందరు కలిసి పనిచేయాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.

పనబాక లక్ష్మి గతంలో నెల్లూరు నుంచి రెండు సార్లు, బాపట్ల నుంచి ఒక సారి ఆమె 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి గా పనిచేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ,జౌళి తదితర మంత్రిత్వ శాఖలను ఆమె నిర్వర్తించారు. ఇలా కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన పనబాక లక్ష్మి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో టీడీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మరోవైపు బీజేపీ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. గతంలో తిరుపతి నుంచి ఓ సారి బీజేపీ గెలుపొందింది. అలాగే, ఇటీవల తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో అదే ఉత్సాహాన్ని తిరుపతిలో కూడా కంటిన్యూ చేయాలని బీజేపీ భావిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 19, 2020, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading