పవన్ కల్యాణ్ (Pawan kalyan) ను గౌరవించాలని.. పువ్వుల్లో పెట్టి చూకోవాలని ప్రధాని మోదీ (Prime Minster Narendra Modi) తనతో చెప్పినట్లు సోము వీర్రాజు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన (Janasena), భారతీయ జనతా పార్టీలు (Bharatiya Janatha Party) పొత్తును కొనసాగిస్తున్నాయి. తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక (Tirupati By-poll) సందర్భంగా రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. ఉపఎన్నికలో గెలిచి ఏపీలో జెండా పాతాలని బీజేపీ భావిస్తుండగా.. తమ ఉనికిని బలంగా చాటాలని జనసేన ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ, జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడటమే తమ లక్ష్యమన్నారు. ఇది తన ఒక్కడి మాటే కాదని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలన్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిందిగా మోదీ, అమిత్ షా తనకు చెప్పారన్నారు. కచ్చితంగా పవన్ కల్యాణ్ ను ఈ రాష్ట్రానికి అధినేతగా చూస్తారన్నారు. బీజేపీ, జనసేన కార్యకర్తలు ఈ అంశాన్ని ట్రూ స్పిరిట్ గా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తిరుపతి అభ్యర్థి విషయంలో రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ వచ్చిన నేపథ్యంలో విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. తిరుపతి ఉపఎన్నికలో గట్టెక్కేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తిరుపతిలో గెలివడమో లేదా..ఓటు శాతాన్ని పెంచుకోవడం బీజేపీ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులను ప్రసన్నం చేసుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే రత్నప్రభ నేరుగా హైదరాబాద్ వెళ్లి పవన్ మద్దతు కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా సోము వీర్రాజు చేసిన సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తిరుపతిలో పవన్ మద్దతు లేకపోతే కష్టమని భావించే బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జనసేనకు తిరుపతిలో మంచి కేడర్ ఉంది. జనసేన అభ్యర్థినే పోటీకి నిలబెట్టాలని అక్కడి నేతలు, కార్యకర్తలు పట్టుబట్టారు. కానీ బీజేపీనే అభ్యర్థిత్వం దక్కించుకుంది. అభ్యర్థి తమ పార్టీకి చెందిన వారైనా.. జనసేన సపోర్ట్ లేకపోతే కష్టమని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
దీంతో మిత్రపక్షాన్ని ప్రసన్నం చేసుకొని పవన్ ను రంగంలోకి దించేందుకు యత్నిస్తుండగానే.. సోము వీర్రాజు ఈ కామెంట్స్ చేయడం సంచలనం రేపింది. జనసేన స్థానిక నాయకులు, కార్యకర్తలను ఉత్తేజ పరిచి ప్రచారంలో పాల్గొనేలా చేయాలనేది బీజేపీ వ్యూహమని.. అందులో భాగంగానే పవన్ ను అధినాయకుడిగా కీర్తించారని చెప్తున్నారు. మరి బీజేపీ చేసిన ప్రటకటన.. తిరుపతి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకా లేక లాంగ్ రన్ లో అదే మాటపై నిలబడతారా..? అనేది వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.