తిరుమల లడ్డూకు స్పెషల్ ప్యాకింగ్.. ఇకపై జూట్ బ్యాగుల్లో ప్రసాదం

లడ్డూ ప్రసాదం

తిరుమలలో ప్లాస్టిక్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా లడ్డూ కవర్లకు బదులు జూట్‌ బ్యాగులను అందుబాటులోకి తెస్తామని టీటీడీ అధికారులు తెలిపారు

  • Share this:
    ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్వామి వారి ప్రసాదాన్ని జూట్ బ్యాగుల్లో భక్తులకు అందివ్వాలనుకుంటుంది టీటీడీ. ఆగష్టు నెల మూడో వారం నుంచి తిరుమల లడ్డూ వితరణ శాలలో జూట్‌ బ్యాగ్స్‌ (జనపనార సంచులు) ను విక్రయించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా లడ్డూ కవర్లకు బదులు జూట్‌ బ్యాగులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీతో సంప్రదించగా గత నెలలో మూడురోజులు 5రూపాయల విలువ చేసే జూట్‌ బ్యాగులను విక్రయించి భక్తుల నుంచి సలహాలు స్వీకరించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే జూట్‌బ్యాగ్స్‌ విక్రయాలను ప్రారంభించనుందని ఆయన పేర్కొన్నారు.

    దీంతో పాటు శ్రీనిధి ట్రస్టు ద్వారా రూ.10వేల విరాళం స్వీకరించి విఐబీ బ్రేక్ టికెట్టు ప్రతిపాదనను బోర్డు దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. నవంబర్ నెలకు 69254వేల ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే స్థానిక ఆలయాల్లో సేవా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ కోటా, పరకామణి సేవ, పిలిగ్రిమ్ వెల్ఫేర్ శ్రీవారి సేవలకు స్టాల్‌లను కూడా విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    11వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయని చెప్పారు. వచ్చేనెల 30న ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇంజనీరింగ్‌ పనులు ఇప్పటికే మొదలయ్యాయని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. గరుడసేవకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం మాడవీధులకు పైకప్పు ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
    First published: