సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టిప్పుసుల్తాన్ విగ్రహం వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం వైసీపీ నేతలు, స్ధానిక ముస్లింలు ప్రయత్నిస్తుండగా.. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. నిన్న విగ్రహ ఏర్పాటుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇవాళ విష్ణువర్ధన్‌రెడ్డి ఏకంగా విగ్రహం సందర్శనకు వెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది. పరిస్థితి తోపులాట.. అరెస్టుల వరకు వెళ్లింది. ఈ విషయంపై రెండు పార్టీలు వెనక్కు తగ్గేది లేదంటున్నాయి. అధికార వైసీపీ-బీజేపీ నేతలు సై అంటే సై అంటున్నారు. బీజేపీ నేతలు కావాలనే కడప జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చరిత్ర తెలుసుకోకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ప్రొద్దుటూరులోని జిన్నా రోడ్డులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే తాము ఊరుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి మరోసారి హెచ్చరించారు. టిప్పుసుల్తాన్ విగ్రహంతోనే వైసీపీ పతనం మొదలవుతుందంటూ నిప్పులు చెరిగారు. మొదట టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి తరువాత అఫ్జల్ గురు విగ్రహం పెట్టేందుకు కూడా సిద్దమవుతారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కార్‌కు టిప్పుసుల్తాన్, కసబ్, అప్ఘల్ గురు వంటి వారు దేశభక్తుల్లా కనిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీరి చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దేశద్రోహుల విగ్రహాలు పెడితే ప్రజలు రాళ్లతో కొడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు కసబ్, అఫ్జల్ గురు, టిప్పు సుల్తాన్ చరిత్రలు మాత్రమే తెలుస్తాయి.. రాష్ట్రంలో అనేకమంది కవులు, కళాకారులు, చరిత్రకారులు ఉన్నారు. అన్నమయ్య, సత్యసాయిబాబా, వేంకటేశ్వరస్వామి.. ఇంతమంది చరిత్రకారులు పుట్టిన రాయలసీమగడ్డలో వైసీపీ ప్రభుత్వం ఒక్క చరిత్రకారుడి పేరుతో పథకం పెట్టలేదు. దేశ ద్రోహుల విగ్రహాలు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: శనివారం అంటే భయం భయం.. తెల్లవారిదంటే టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకో తెలుసా
అయితే టిప్పుసుల్తాన్ విగ్రహం విషయంలో బీజేపీ వైఖరిని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తప్పుబట్టారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడేనని, జాతీయవాదంతో టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. బ్రిటిష్ చరిత్ర కారులు రాసిన చరిత్ర చదివి రాద్ధాంతం చేయొద్దని బీజేపీ నేతలకు సూచించారు. ప్రొద్దుటూరు ప్రజలు టిప్పుసుల్తాన్ గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు. కేవలం బీజేపీ మతసామరస్యాన్ని దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా శాస్త్ర్రీయ ఆధారాలు ఉంటే బీజేపీ నేతలు నిరూపించాలని, తాను అంత మేథావిని కాదని, ప్రొద్దుటూరులో మేథావులతో చర్చ పెట్టి టిప్పుసుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడు కాదని నిరూపిస్తే ఒప్పుకుంటానని అన్నారు. బీజేపీ నేతల ఆందోళనలు ఎలా ఉన్నా.. వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీంతో అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.