చిదంబరంపై అమిత్ షాకు వ్యక్తిగత పగ.. చర్యకు ప్రతిచర్య..?

Amit Shah | Chidambaram | CBI | నాడు అధికారంతో అమిత్ షాను చిదంబరం అరెస్టు చేయించారని.. ఇప్పుడు అదే అధికారంతో చిదంబరాన్ని షా అరెస్టు చేయించారని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 22, 2019, 10:36 AM IST
చిదంబరంపై అమిత్ షాకు వ్యక్తిగత పగ.. చర్యకు ప్రతిచర్య..?
చిదంబరం (File: PTI)
  • Share this:
ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి.. అన్న సామెత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ చిదంబరానికి సరిగ్గా సరిపోతుంది. నాడు అధికారంతో అమిత్ షాను చిదంబరం అరెస్టు చేయించారని.. ఇప్పుడు అదే అధికారంతో చిదంబరాన్ని షా అరెస్టు చేయించారని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. విధి అంటే ఇదే అంటారు కొందరు.. కాలం అలా కలిసి వస్తుందని అంటారు ఇంకొందరు.. చర్యకు ప్రతిచర్య అంటారు మరికొందరు.. ఏ రకంగా అనుకున్న కాలచక్రం ఎంత త్వరగా, ఎంత పక్కాగా, ఎంత వ్యూహాత్మకంగా తిరిగిందో చెప్పడానికి అమిత్ షా, చిదంబరమే ఉదాహారణ. అది యూపీఏ పాలన.. 2008 నవంబరు 29 నుంచి 2012 జూలై 31 వరకు చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోద్రా అల్లర్లు, సహా పలు ఎన్‌కౌంటర్లకు బాధ్యుడిని చేస్తూ మోదీని ఇరికించే ప్రయత్నం చిదంబరం చేశారని అప్పట్లో బీజేపీ ఆరోపించింది. కానీ, అది వీలుకాకపోవడంతో మోదీ తర్వాత శక్తిమంతమైన నాయకుడిగా ఉన్న అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షాపై చిదంబరం గురి పెట్టారని తెలిపింది.

అప్పట్లో జరిగిన సోహ్రాబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, సహాయకుడు తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్‌లు చిదంబరానికి అస్త్రంగా దొరికాయి. అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, దానికి అమిత్‌ షా పథకం రచించారని సీబీఐ 2010లో అభియోగాలు మోపింది. 2010 జూలై 25న అమిత్‌ షాను ఈ కేసులో అరెస్టు చేశారు. హత్య, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్‌ అభియోగాలు మోపారు. స్వతహాగా లాయరైన చిదంబరం ఈ చార్జిషీటును పరిశీలించి పలు మార్పులు చేర్పులు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అరెస్టయిన వెంటనే మంత్రి పదవికి అమిత్‌ షా రాజీనామా చేశారు. ఆయన మూడు నెలలు జైలులో ఉన్నారు.

మోదీ హస్తం ఉందని చెప్పాలంటూ ఆయనపై ఒత్తిళ్లు కూడా వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. మోదీకి నమ్మినబంటు అయిన షా ఒత్తిళ్లకు షా లొంగలేదు. ఆయనకు బెయిల్‌ రాకుండా సీబీఐ అడ్డుకుంది. చివరికి, 2010 అక్టోబరు 29న బెయిల్ ఇచ్చిన గుజరాత్‌ హైకోర్టు.. రెండేళ్లపాటు గుజరాత్‌లో షా అడుగు పెట్టకుండా తీర్పు ఇచ్చారు. అమిత్‌ షా రాష్ట్రాన్ని విడిచి, ఢిల్లీలోని గుజరాత్‌ భవన్‌లోని ఒక గదిలో రెండేళ్లపాటు ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. చివరికి కేసు విచారణను ముంబైకి బదిలీ చేస్తూ గుజరాత్‌లో షా అడుగుపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇలా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న అమిత్ షాకు అచ్చొచ్చినట్లు.. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వచ్చీరాగానే చిదంబరానికి కష్టాలు మొదలయ్యాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో పెట్టుబడుల కేసును దాదాపు ఐదేళ్లుగా సీబీఐ, ఈడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేశాయి. ఈ కేసుల్లో అరెస్టు కాకుండా ఆయన ఎప్పటికప్పుడు ముందస్తు బెయిల్‌ తెచ్చుకుంటూ వచ్చారు. కుమార్తె హత్య కేసులో జైల్లో ఉన్న ఐఎన్‌ఎక్స్‌ అధినేత పీటర్‌ ముఖర్జీ, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్లుగా మారి చిదంబరానికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడంతో ఉచ్చు బిగుసుకుంది. ఇంకేముంది.. ఇప్పుడు.. అదే అమిత్‌ షా కేంద్ర హోంమంత్రి పదవిలో ఉన్నారు. చిదంబరం ఎంపీ మాత్రమే. నాడు అమిత్ షా ఇబ్బంది పెట్టిన సీబీఐ, ఈడీ అధికారులే ఇప్పుడు చిదంబరాన్ని వెంటాడుతుండటం గమనార్హం.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు