సీఎం జగన్ ప్రభుత్వానికి ఒకే రోజు మూడు ఎదురుదెబ్బ‌లు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకే రోజు మూడు ఎదురుదెబ్బలు తగిలాయి.

news18-telugu
Updated: May 22, 2020, 4:37 PM IST
సీఎం జగన్ ప్రభుత్వానికి ఒకే రోజు మూడు ఎదురుదెబ్బ‌లు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకే రోజు మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల జీవోను హైకోర్టు కొట్టి వేసింది, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌‌ను కూడా ఎత్తివేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌తో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. విశాఖలో అరెస్టయిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ వ్యవహారంపై 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ప్రస్తావన లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదన్న హైకోర్టు... దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి తమకు ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని... అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 623ను హైకోర్టు రద్దు చేసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వం తరపున కోర్టుకు న్యాయవాది వాదనలు విన్పించారు. అయితే సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించలేదని హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ విషయంపై కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని హైకోర్టు హెచ్చరించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 28న సుమోటో కేసుగా హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, సస్పెన్షన్ విధించిన కాలానికి సంబంధించి కూడా ఆయనకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు పక్కన పెట్టింది.
First published: May 22, 2020, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading