ఏటీఎం దొంగతనానికి ప్లాన్ వేశారు. మిషన్ ఓపెన్ చేసేందుకు యత్నించారు. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఓపెన్ కాలేదు. చివరికి చేసేదేం లేక అందులో పెట్రోల్ పోసి తగలబెట్టారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా పరిగి మండలం, కొడిగెనహళ్లిలో అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఇండియన్ బ్యాంక్ ఏటిఎంలో ప్రవేశించారు. ఏటీఎం దొంగతనానికి విఫలయత్నం చేశారు. కానీ డోర్ తెరుచుకోకపోవడంతో చేసేది లేక పెట్రోల్ పోసి నిప్పంటించారు. దొంగలు చేసిన పనితో దాదాపు రూ.6లక్షలు కాలి బూడిదయ్యాయి. ఐతే బ్యాంక్ సిబ్బంది ఏటీఎంలో రూ.9లక్షలు ఉంచగా.., అందులో రూ.3 లక్షలు డ్రా చేశారు. దొంగతనానికి ముందుకు రూ.22 లక్షలు డ్రా చేయడంతో ఏటీఎంలో రూ.5.80 లక్షలు ఉన్నాయి.
బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన సమాచారంలో ఘటనాస్థలిని పరీశీలించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ను సేకరించారు. సీసీ ఫుటేజ్ లో ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి యత్నించినట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఐతే చోరీకి యత్నించిన వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అననుమానితుల్లో ఒకడైన మనోజ్ కుమార్ ఆబాబాద్ పేటలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మనోజ్ హిందూపురంలోని ఓ పరిశ్రమలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. చోరీకి యత్నించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు నిందుతుడ్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఐతే మనోజ్ కుమార్ నిజంగా దొంగతనానికి యత్నించాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సీసీ ఫుటేజ్ లోని రెండో వ్యక్తి దొరికితే అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు చెప్తున్నారు.
Published by:Purna Chandra
First published:January 02, 2021, 11:33 IST