Dubbaka Election: దుబ్బాకలో పోటీకి ఆ పార్టీలు సై!

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు టీడీపీ సైతం అక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ గా బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలుపు కోసం కొందరు, బలం చాటేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు.


Updated: September 25, 2020, 4:01 PM IST
Dubbaka Election: దుబ్బాకలో పోటీకి ఆ పార్టీలు సై!
దుబ్బాక పట్టణం
  • Share this:
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంపై కన్నేశాయి. తమ సొంత స్థానాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం జిల్లాకు చెందిన మంత్రి హరీశ్ రావు ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో వరసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనుకుంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలంటూ హరీశ్ రావు ప్రచారం చేస్తున్నారు. వివిధ పార్టీల నేతలకు గులాబీ కండువా కప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. టీఆర్ఎస్ కే ఓటు వేస్తామంటూ తమకు పట్టు అధికంగా ఉన్న గ్రామాల్లో తీర్మానాలు చేయించి ప్రతిపక్షాల ధీమాను దెబ్బకొట్టేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు సైతం పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే బీజేపీ నేత రఘునందన్ రావు ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. ఊరూరా తిరుగుతూ పార్టీ జెండాలను ఆవిష్కరిస్తున్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలతో పోల్చితే దుబ్బాక ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో అన్న విషయం ఇంకా తేలకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు కర్ణం శ్రీనివాస్, నరసింహారెడ్డితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు తమకు టికెట్ కేటాయించాలని గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారు.

గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో తీవ్రంగా దెబ్బతిన్న టీడీపీ సైతం ఇక్కడ పోటీకి సై అంటోంది. ఆ పార్టీకి చెందిన ఇల్లెందుల రమేష్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ నుంచి ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించిన ప్రముఖ యాంకర్ కత్తి కార్తీక సైతం ప్రచారాన్ని ప్రారంభించారు. ఊరూరా తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. మార్పు కోసం తనను గెలిపించాలని కోరుతున్నారు. పక్క నియోజకవర్గాలతో పోల్చితే దుబ్బాకలో అభివృద్ధి ఆశించినంత జరగడం లేదన్న ప్రచారం అధికార టీఆర్ఎస్ ఇబ్బంది కలిగించేలా మారింది. పలు ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో స్థానికులకు ఇతర ప్రాంతాల నిర్వాసితులతో పోల్చితే తక్కువ పరిహారం అందిందన్న అభిప్రాయం సైతం కారు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు పరిశీలిస్తే దుబ్బాక పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published by: Nikhil Sangani
First published: September 25, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading