టాప్ 5 అత్యధిక, అత్యల్ప మెజారిటీలు.. జగన్ టాప్.. లిస్ట్‌లో లేని చంద్రబాబు..

అత్యధిక మెజారిటీల టాప్ 5 జాబితాలో జగన్ మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. అత్యల్ప మెజారిటీల టాప్-5 జాబితాలోనూ ముగ్గురు వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

news18-telugu
Updated: May 24, 2019, 7:56 PM IST
టాప్ 5 అత్యధిక, అత్యల్ప మెజారిటీలు.. జగన్ టాప్.. లిస్ట్‌లో లేని చంద్రబాబు..
చంద్రబాబు, జగన్ (File)
news18-telugu
Updated: May 24, 2019, 7:56 PM IST
ఏపీ అసెంబ్లీకి ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ... అత్యధిక, అత్యల్ప మెజారిటీ రికార్డులను సైతం తన పేరిటే నమోదు చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించగా.. ఆ పార్టీకే చెందిన విజయవాడ సెంట్రల్ అభ్యర్ధి మల్లాది విష్ణు 25 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి దాదాపు 30 వేల మెజారిటీతో సరిపెట్టుకోక తప్పలేదు.  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా 90,110 ఓట్ల తేడాతో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ప్రత్యర్ధి సతీష్ కుమార్ రెడ్డిని చిత్తు చేశారు. తద్వారా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ రికార్డును నెలకొల్పారు. ఆయన తర్వాత గిద్దలూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి అన్నారాంబాబు... 81,035 ఓట్ల తేడాతో గెలుపొంది మెజారిటీలో రెండో స్ధానంలో నిలిచారు. సూళ్లూరు పేట వైసీపీ అభ్యర్ధి కిలివేటి సంజీవయ్య 61,292 ఓట్ల మెజారిటీని సాధించి రాష్ట్రంలో మూడో స్ధానంలో నిలిచారు, 55,207 ఓట్ల మెజారిటీ సాధించిన అనపర్తి వైసీపీ అభ్యర్ధి సత్తి సూర్యనారయణ రెడ్డి నాలుగో స్ధానంలోనూ, పాడేరులో 42 వేల 804 ఓట్లు సాధించిన వైసీపీ అభ్యర్ధి భాగ్యలక్ష్మి ఐదో అత్యధిక మెజారిటీ రికార్డును సాధించారు. టాప్ -5 అత్యధిక మెజారిటీ రికార్డుల్లో అందరూ వైసీపీ అభ్యర్ధులే కావడం మరో విశేషం.

రాష్ట్రంలో అత్యల్ప మెజారిటీ సాధించిన వారిలోనూ వైసీపీదే పైచేయి అయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మల్లాది విష్ణు రాష్ట్రంలోనే అత్యల్పంగా 25 ఓట్ల తేడాతో టీడీపీ ప్రత్యర్ధి బోండా ఉమామహేశ్వరరావును ఓడించారు. ఆయన తర్వాత స్ధానంలో తిరుపతి నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. తిరుపతిలో భూమన... టీడీపీ ప్రత్యర్ధి సుగుణమ్మపై కేవలం 708 ఓట్ల తేడాతో గట్టెక్కారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు 814 ఓట్ల తేడాతో వైసీపీ ప్రత్యర్ధి బొంతు రాజేశ్వరరావుపై గెలుపొంది అత్యల్ప మెజారిటీ జాబితాలో మూడో స్ధానంలో నిలిచారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీమోహన్ 838 ఓట్ల తేడాతో వైసీపీ ప్రత్యర్ధి యార్లగడ్డ వెంకట్రావుపై గెలిచి ఈ జాబితాలో నాలుగో స్ధానంలో ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా వేమూరులో వైసీపీ నుంచి గెలిచిన మేరుగు నాగార్జున 999 ఓట్ల తేడాతో గెలిచి అత్యల్ప మెజారిటీల జాబితాలో ఐదోస్ధానం దక్కించుకున్నారు. స్ధూలంగా చూస్తే అత్యల్ప మెజారిటీల టాప్-5 జాబితాలోనూ ముగ్గురు వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

ఏపీలో టాప్-5 అత్యధిక మెజారిటీలు

వైఎస్ జగన్‌మోమోహన్ రెడ్డి- 90,110


అన్నారాంబాబు- గిద్దలూరు- 81,035
కిలివేటి సంజీవయ్య- సూళ్లూరుపేట- 61,292
సత్తి సూర్యనారయణ రెడ్డి- అనపర్తి- 55,207
Loading...
భాగ్యలక్ష్మి - పాడేరు 42,804

ఏపీలో టాప్-5 అత్యల్ప మెజారిటీలు

మల్లాది విష్ణు, విజయవాడ సెంట్రల్  25 ఓట్లు
భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి 708
రాపాక వరప్రసాద్, రాజోలు 814
వల్లభనేని వంశీ, గన్నవరం 838
మేరుగు నాగార్జున, వేమూరు 999

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...