హోమ్ /వార్తలు /రాజకీయం /

ఒకప్పుడు భారత్ పరిస్థితి అది.. ఇప్పుడు ఇది.. మా విజయానికి ఇదో ఉదాహరణ : మోదీ

ఒకప్పుడు భారత్ పరిస్థితి అది.. ఇప్పుడు ఇది.. మా విజయానికి ఇదో ఉదాహరణ : మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

వారి వారి జాతీయ ప్రయోజనాల కోసం ప్రతీ దేశానికి కొన్ని సొంత ప్రణాళికలు, వ్యూహాలు ఉంటాయని అన్నారు. ఒకప్పుడు అంతర్జాతీయంగా భారత్‌ పరిస్థితేంటో.. ఇప్పుడెలా మారిపోయిందో ఇంటర్వ్యూలో వివరించారు.

  భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు. ఇదే ఇంటర్వ్యూలో.. మోదీ పాక్-చైనా మిత్రుత్వంపై స్పందించారు. తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర పడకుండా చైనా నాలుగోసారి అడ్డుకుంది. ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్నకు మోదీ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఒకప్పుడు అంతర్జాతీయంగా భారత్ పరిస్థితి ఏమిటి.. ఇప్పుడేమిటి అన్నది వివరించారు.


  ఓవైపు చైనాతో మనకు ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. చైనా మన దేశంలో పెట్టుబడులు పెడుతోంది, మనం చైనాలో పెట్టుబడులు పెడుతున్నాం. మన నాయకులు అక్కడికి వెళ్తున్నారు.. చైనా నాయకులు ఇక్కడికి వస్తున్నారు. మరోవైపు చైనాతో ఇప్పటికీ సరిహద్దు సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. భారత్‌కు ఒక స్పష్టమైన వైఖరి ఉంది.. చైనా దృక్పథం మరోలా ఉంది. కాబట్టి ఇరువర్గాలు భిన్నత్వాన్ని ఆమోదించాలి.. విభేదించడాన్ని వివాదంగా మలచాలని భావించకూడదు.
  ప్రధాని నరేంద్ర మోదీ


  కొన్ని సందర్భాల్లో మనం పాలస్తీనా వైపు నిలబడ్డామని, మరికొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ వైపు నిలబడ్డామని ఇంటర్వ్యూలో మోదీ గుర్తుచేశారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇరాన్ వైపు నిలబడితే.. మరికొన్ని సందర్భాల్లో అరబ్ దేశాల వైపు నిలబడ్డామని చెప్పారు. వారి వారి జాతీయ ప్రయోజనాల కోసం ప్రతీ దేశానికి కొన్ని సొంత ప్రణాళికలు, వ్యూహాలు ఉంటాయని అన్నారు. ఒకప్పుడు అంతర్జాతీయంగా భారత్‌కు రష్యా మద్దతు మాత్రమే ఉండేది.. మిగతా ప్రపంచ దేశాలన్ని పాకిస్తాన్‌కు మద్దతుగా నిలబడేవని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని.. కేవలం చైనా మాత్రమే పాకిస్తాన్‌తో ఉందని.. మిగతా ప్రపంచ దేశాలన్ని భారత్ వెంట ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ మార్పును మనం అర్థం చేసుకోవాలని.. తమ విజయానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.


  పాకిస్తాన్‌కు వెనకేసుకొస్తున్న చైనాకు సరైన గుణపాఠం చెప్పాలంటే.. ఆ దేశ వస్తువులను భారత్‌లో బహిష్కరించాలని కొంతమంది అభిప్రాయపడుతుండటంపై మోదీ స్పందించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రతీ దేశం మరో దేశంపై ఆధారపడటం, వారితో సంబంధాలు కలిగి ఉండటం జరిగిందన్నారు. ఒక ప్రభుత్వంగా ప్రపంచ ట్రేడ్ ఆర్గనైజేషన్ చట్టాలను భారత్ ఫాలో కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక చైనా వస్తువులను కొనాలా వద్దా.. అన్నది ప్రజల వ్యక్తిగత నిర్ణయమని అన్నారు.

  First published:

  Tags: Bjp, China, India VS Pakistan, India-China, Lok Sabha Election 2019, Narendra modi, Pm modi, Russia