అమరావతిలో దెబ్బకు దెబ్బ.. జగన్, చంద్రబాబు ఇద్దరికీ షాక్...

గతంలో అమరావతిలో పర్యటించిన జగన్‌కు రైతులు నల్లజెండాలు చూపారు. ఇప్పుడు చంద్రబాబు కాన్వాయ్ మీద కొందరు చెప్పులు విసిరారు.


Updated: November 28, 2019, 5:46 PM IST
అమరావతిలో దెబ్బకు దెబ్బ.. జగన్, చంద్రబాబు ఇద్దరికీ షాక్...
సీఎం జగన్, చంద్రబాబునాయుడు
  • Share this:
ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రైతుల నుంచి నిరసనల సెగ ఎదురైంది. ప్లాట్ల కేటాయింపులో అన్యాయం చేశారంటూ కొందరు రైతులు వెంకటపాలెం సమీపంలో ఆయన కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. నల్లజెండాలు సైతం ప్రదర్శించారు. అయితే 2015లో అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి రైతుల భూములను బలవంతంగా సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ స్ధానిక గ్రామాల్లో పర్యటించారు. అప్పట్లో జగన్ రాకను నిరసిస్తూ నల్లజెండాలు, బ్యానర్లు ప్రదర్శించిన రైతులు తమ గ్రామాల్లోకి రావొద్దంటూ నిరసనలు తెలిపారు.

ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించాక అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసమీకరణ చేపట్టింది. గతంలో 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని కాదని ల్యాండ్ పూలింగ్ పేరుతో కొత్త విధానాన్ని సైతం తీసుకొచ్చింది. ఇందులో రాజధాని అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. తదనుగుణంగా సీఆర్డీయే ఏర్పాటుతో పాటు 33 వేల ఎకరాల భూసమీకరణకు సిద్దపడింది. అయితే రాజధానిలో భాగంగా ఉన్న ఉండవల్లి, పెనుమాకతో పాటు పలు గ్రామాల రైతులు మూడు పంటలు పంటే తమ సారవంతమైన భూములను రాజధానికి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. దీంతో వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్ధానిక మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమతో పాటు మరికొందరిని అక్కడికి పంపింది. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ వారికి మద్దతు ప్రకటించింది. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేయడం మంచిది కాదంటూ వారికి అండగా నిలవాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. అయితే భూసేకరణను వ్యతిరేకించిన గ్రామాల వరకూ పరిస్ధితి సానుకూలంగానే ఉన్నా.. మిగతా గ్రామాల్లో మాత్రం జగన్ కు నిరసనల సెగ ఎదురైంది. జగన్ రాకను నిరసిస్తూ స్ధానిక రైతులు నల్లజెండాలు, బ్యానర్లు ప్రదర్శించారు. తమ గ్రామాల్లోకి రావొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. అయినా జగన్ వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే పరిస్ధితి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎదురైంది. రాజధాని గ్రామాల్లో తమకు అనుకూలంగా ఉన్న రైతులు మాత్రం చంద్రబాబు పర్యటనను స్వాగతించగా.. మిగతా వారి నుంచి మాత్రం నిరసనల సెగ ఎదురైంది. గతంతో పోలిస్తే ఈసారి నల్లజెండాలతో పాటు చెప్పుల దాడి కూడా జరిగింది. అయితే ఈ నిరసనల వెనుక అసలు కారణాలను ఓసారి పరిశీలిస్తే రాజధానిలో ఉన్న సామాజిక సమీకరణాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న చంద్రబాబు సామాజిక వర్గ రైతులు, నేతలు గతంలో టీడీపీ ప్రభుత్వం అడగ్గానే ఆలోచించకుండా వేలాది ఎకరాలను ఇచ్చేశారు. అభివృద్ధిపై చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకే తాము భూములిచ్చామని అప్పట్లో చెప్పుకున్న సదరు సామాజిక వర్గ రైతులు... తాజాగా నిపుణుల కమిటీ పర్యటన సమయంలో మాత్రం ప్రభుత్వాన్ని చూసే భూములు అప్పగించామని, చంద్రబాబుతో తమకెలాంటి సంబంధం లేదని, ఆయన్ను బూచిగా చూపి తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. ఇవాళ వైసీపీ అనుకూల రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టగా.. టీడీపీ అనుకూల రైతులు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా ఆయనతో పాటు సాగారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: November 28, 2019, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading