Tamilnadu: పార్టీలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయిస్తే బంగారు కాయిన్లు.. తమిళనాడు కాంగ్రెస్​ బంఫర్​ ఆఫర్​

ప్రతీకాత్మక చిత్రం

పార్టీ సభ్యత్వ నమోదులో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చే వారికి బంగారు ఉంగరాలు (gold rings), కాయిన్స్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్. ఆ మేరకు దక్షిణ చెన్నై డీసీసీ అధ్యక్షుడు ఎంఏ ముత్తలగన్ (MA Mutthalagan) చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • Share this:
    తమిళనాడు (Tamil Nādu). విభిన్న రాజకీయాలకు నిలయం. ప్రాంతీయ వాదం ఎక్కువున్న రాష్ట్రం (state) కూడా. భాషపై మక్కువ ఎక్కువ. సినీ తారలనూ సీఎం (CM)లు చేసిన ఘనత ఉంది. గత ఎన్నికల్లో డీఎంకే అత్యధిక స్థానలు గెలుచుకుంది. ఎన్నికల గుర్తులో ఉండే ఉదయించే సూర్యుడిలా.. కరుణానిధి తనయుడు స్టాలిన్​ తమిళనాడుకు సీఎం (Tamilnadu CM) అయ్యాడు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే కూటమి 160 సీట్లు సాధించింది. మరో 74 సీట్లలో అన్నాడీఎంకే కూటమి గెలిచింది. డీఎంకే కూటమిలో.. డీఎంకే 126, కాంగ్రెస్ 18, ఇతర పార్టీలు మిగతా చోట్ల విజయం సాధించాయి. అన్నాడీఎంకే పార్టీలో.. అన్నాడీఎంకేలో 64, పీఎంకే 5, బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. అయితే ఇక్కడ కాంగ్రెస్​ పార్టీ (congress party) మాత్రం 18 స్థానాలతోనే సరిపెట్టుకుంది. అప్పట్లో బలంగానే ఉన్న కాంగ్రెస్​ తర్వాత చతికిలపడింది. అయితే పార్టీ క్యాడర్ బేస్‌ను పెంచుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) ఇటీవల వినూత్న ప్రకటన చేసింది.

    బంగారు ఉంగరాలు ఇస్తామంటూ..

    పార్టీ సభ్యత్వ నమోదులో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చే వారికి బంగారు ఉంగరాలు (gold rings), కాయిన్స్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్. ఆ మేరకు దక్షిణ చెన్నై డీసీసీ అధ్యక్షుడు ఎంఏ ముత్తలగన్ (MA Mutthalagan) చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఇందులో భాగంగా ఓ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ప్రతి వీధిలో కాంగ్రెస్.. ప్రతి ఇంట్లో కాంగ్రెస్’ అంటూ ఆదివారం నాడు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    సభ్యత నమోదు ఎక్కువ చేస్తే..

    దక్షిణ చెన్నై డీసీసీ (South Chennai DCC) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేత రాహుల్ గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలంటూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన డీసీసీ అధ్యక్షుడు (DCC chief).. జిల్లా పరిధిలో అత్యధిక సంఖ్యలో పార్టీ సభ్యులను చేర్చేవారికి 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని(8 grams gold ring) బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే రెండో స్థానంలో నిలిచే వ్యక్తికి 4 గ్రాముల బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీరితో పాటుగా సభ్యత్వ నమోదులో చురుకైన పాత్ర పోషించి.. ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాన్ని నమోదుచేసే పార్టీ నేతలకు బంగారు కాయిన్స్ (gold coins) బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు (TNCC chief) కేఎస్ అళగిరి, ఏఐసీసీ కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్ సమక్షంలోనే డీసీసీ ఈ ఆసక్తికర ప్రకటన చేయడం విశేషం.

    పార్టీలో సభ్యులను పెంచుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తీవ్రంగా శ్రమించడం తెలిసిందే. అయితే సభ్యత్వ నమోదు కోసం ఈ రకంగా బంగారు ఉంగరాలు, కాయిన్స్ బహుమతిగా ప్రకటించడం వింతగా ఉందంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ  బహుమతులు డీసీసీ అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఇచ్చేవే తప్ప.. పార్టీకి సంబంధంలేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నేతలు చెబుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published: